UPDATES  

 కుండపోత వర్షాలు..ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు

కుండపోత వర్షాలు..ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు

తెలంగాణలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఇదే సమయంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది. ఈ క్రమంలోనే వానలు పడుతున్న పలు జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన బలమైన వాయుగుండం ప్రభావంతో ఉత్తర తెలంగాణలోని పలు ప్రాంతాలు తడిసిముద్దవుతున్నాయి. గత రెండు రోజులుగా ఏకధాటిగా కురుస్తున్న కుండపోత వర్షాల వల్ల జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. వాగులు, వంకలు పొంగిపొర్లుతుండటంతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. రాకపోకలు నిలిచిపోయి చాలా గ్రామాలు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. అకస్మాత్తుగా విరుచుకుపడుతున్న వరదలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

భారీ వర్షాలు, ప్రతికూల వాతావరణం నేపథ్యంలో విద్యార్థుల ప్రాణ రక్షణే ధ్యేయంగా జిల్లా యంత్రాంగాలు తక్షణ చర్యలు తీసుకున్నాయి. నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ హరిత గురువారం నాటికి పాఠశాలలు, విద్యాసంస్థలకు సెలవు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వర్షాల ఉధృతి తగ్గే వరకు పిల్లలను బయటకు పంపవద్దని తల్లిదండ్రులను అధికారులు కోరారు. ఉదయం నుంచే వర్షంలో చిన్నారులు ఇబ్బంది పడుతున్నారని, రాష్ట్రవ్యాప్తంగా స్కూళ్లకు సెలవులు ఇవ్వాలని పలువురు తల్లిదండ్రులు సోషల్ మీడియా లో ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.

ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్, తిర్యాని మండలాల్లో సుశ్మీర్ వాగు ఉప్పొంగడంతో దాదాపు 12 గ్రామాలకు రవాణా సౌకర్యం నిలిచిపోయింది. సిర్పూర్ (టి) సమీపంలో పెన్‌గంగా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. జగిత్యాల జిల్లాలోని రాయికల్, బీర్పూర్ మండలాల్లో 9 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం రికార్డైంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా సింగరేణి కాకతీయ ఓపెన్ కాస్ట్ గనుల్లోకి నీరు చేరడంతో రోజుకు దాదాపు 20 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి విఘాతం కలిగింది. నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో కూడా వాగులు ఉప్పొంగి రహదారులు కోతకు గురయ్యాయి.

ములుగు జిల్లా మేడారంలో జంపన్న వాగు పొంగిపొర్లుతోంది. ఈ వాగులో పలువురు గల్లంతయ్యారు.కన్నాయిగూడెం ప్రాంతంలో ఇళ్లలోకి వరద నీరు చేరడంతో అధికారులు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఆదిలాబాద్ – మహారాష్ట్ర సరిహద్దుల్లో వాగులు పొంగిపొర్లుతుండటంతో పోలీసులు ట్రాఫిక్‌ను మళ్లించారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు, ముఖ్యంగా పిల్లలు బయటకు రావద్దని, వాగులు దాటే ప్రయత్నం చేయవద్దని హెచ్చరికలు జారీ చేశారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest