విక్రయానికి యత్నించిన నలుగురు అరెస్ట్
భద్రాద్రి బ్యూరో (తెలంగాణ వాణి) చిరుతపులి చర్మం, గోర్లను అక్రమంగా విక్రయించేందుకు యత్నించిన నలుగురు వ్యక్తులను బూర్గంపహాడ్ పోలీసులు, టాస్క్‌ఫోర్స్ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి ఒక ఎండిన చిరుతపులి చర్మం, 17 గోర్లు, ఒక చిన్న బ్యాగును స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబందించిన వివరాలను జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ వెల్లడించారు. విశ్వసనీయ సమాచారం మేరకు బూర్గంపహాడ్ ఎస్ఐ ఈ. నాగబిక్షం ఆధ్వర్యంలో టాస్క్‌ఫోర్స్ పోలీసులు సోమవారం ఉదయం తాళ్లగొమ్మూరు గ్రామంలోని అనిల్‌కుమార్ ఇంటి వద్ద అనుమానాస్పదంగా ఉన్న నలుగురిని అదుపులోకి తీసుకుని, వారి వద్ద తనిఖీలు నిర్వహించగా చిరుతపులి చర్మం, గోర్లు బయటపడ్డాయి.
గుంతలో చిక్కిన చిరుతను చంపి
పోలీసుల విచారణలో నిందితులు కీలక విషయాలు వెల్లడించినట్లు తెలిసింది. గత వేసవిలో చింతూరు మండలం గమ్మలకోట గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో గుంతలో పడి బయటకు రాలేని చిరుతపులిని రాళ్లు, కర్రలతో కొట్టి, బాణాలు విసిరి చంపినట్లు తెలిపారు. అనంతరం దాని చర్మాన్ని తొలగించి ఎండబెట్టడంతో పాటు గోర్లను భద్రపరిచినట్లు వెల్లడించారు. వాటిని విక్రయించి డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో సారపాకకు చెందిన చల్లా అనిల్‌కుమార్‌ను సంప్రదించినట్లు పోలీసులు తెలిపారు. కొనుగోలుదారులను సంప్రదించి విక్రయానికి సహకరిస్తానని అనిల్‌కుమార్ చెప్పడంతో కుంజ భద్రయ్య, కుంజా గంగరాజు, మడవి కన్నయ్యలు చిరుత చర్మం, గోర్లను బ్యాగులో పెట్టుకుని తాళ్లగొమ్మూరుకు తీసుకొచ్చారు. విక్రయానికి ప్రయత్నిస్తుండగా పోలీసులు పట్టుకున్నట్లు పేర్కొన్నారు. అరెస్టయిన వారు చల్లా అనిల్‌కుమార్ (తాళ్లగొమ్మూరు), కుంజ భద్రయ్య, కుంజా గంగరాజు, మడవి కన్నయ్య (గమ్మలకోట) లను పోలీసులు అరెస్టు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.


