మీనాక్షి నటరాజన్ మార్క్ రాజకీయం షురూ
తీన్మార్ మల్లన్నపై సస్పెన్షన్ వేటు
హైదరాబాద్ (తెలంగాణ వాణి)
ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయడం ద్వారా నాయకులకు ఎంతటి బ్యాక్ గ్రౌండ్ ఉన్న వారైన సరే బౌండరి లైన్ దాటితే చర్యలు తప్పావంటు తెలంగాణ కాంగ్రెస్ నూతన ఇంచార్జి మీనాక్షి నటరాజన్ స్ట్రయిట్ వార్నింగ్ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతుంది.
తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ పై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. కులగణన విషయంలో సొంత పార్టీ, ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం షాక్ ఇచ్చింది. ఇప్పటికే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు గాను ఫిబ్రవరి 5న పార్టీ షోకాజ్ నోటీసులు పంపింది. 12 ఫిబ్రవరి వరకు వివరణ కోసం అవకాశం ఇచ్చింది. కానీ మీ నుంచి ఎటువంటి వివరణ డీఏసీ అందుకోలేదు. అయినా కాంగ్రెస్ పార్టీపై పదే పదే మీ దూషణ కొనసాగిస్తున్నారు. మీ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలను దృష్టిలో ఉంచుకుని క్రమశిక్షణ చర్య కమిటీ మిమ్మల్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని నిర్ణయించిందని సస్పెన్షన్ ఆర్డర్ లో చిన్నారెడ్డి పేర్కొన్నారు.