UPDATES  

 ఖిలవనపర్తి గ్రామాన్ని ఎస్సీలకు కేటాయించాలని కలెక్టర్ కు వినతి పత్రం

ధర్మారం (తెలంగాణ వాణి విలేకరి) పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం ఖిలవనపర్తి గ్రామంలోని దళితులు స్థానిక సంస్థల ఎన్నికలలో సర్పంచ్, వార్డు సభ్యులకు పోటీ చేయడానికి అనర్హులుగా మారారు. 2011 జనాభా లెక్కల సర్వే లో ఆ గ్రామంలో ఎస్సీలు 400 ఓటర్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు . కంప్యూటర్ నమోదులో 400 అంకెలలో రెండు సున్నాలను తొలగించి ఒక పురుషుడు ముగ్గురు స్త్రీలు ఉన్నట్లుగా మొత్తం నలుగురు ఎస్సీ జనాభా ఉన్నట్లు నమోదు చేయడంతో నాటి నుండి నేటి వరకు అక్కడి నాయకులు సర్పంచ్ ఎన్నికలలో పోటీ చేయకుండా నిరుత్సాహంగా ఉన్నారు. అధికారులు చేసిన పొరపాట్లపై గతంలో అక్కడి ఎస్సీలు హైకోర్టును సంప్రదించగా ఎన్నికల సమీపంలో ఏమీ చేయలేమని కోర్టు చేతులెత్తేసింది. ఖిలవనపర్తి గ్రామంలో ప్రస్తుతం 500కు పైగా ఎస్సీ ఓటర్లు ఉన్న ఈసారి కూడా ఎస్సీలకు రిజర్వేషన్ దక్కకపోవడంతో ఆ గ్రామానికి చెందిన ఎస్సీలు గురువారం పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, డిపిఓ ను కలిసి వినతి పత్రం అందించి ఈ ఎన్నికలోనైనా జనాభా దామాషా ప్రకారం గ్రామాన్ని ఎస్సీలకు కేటాయించాలని వినతి పత్రంలో పేర్కొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest