ధర్మారం (తెలంగాణ వాణి ప్రతినిధి)
వినాయక చవితి అంటేనే మనకు గుర్తుకు వచ్చేది రకరకాల ఆకృతిలొ కనిపించే గణనాథుల విగ్రహాలు… వాటిని తయారు చేయడంలో రాజస్థానీలకు ప్రత్యేకత ఉంది. కుటుంబ సభ్యులు, పిల్లలు సైతం విగ్రహాల తయారీలో నిమగ్నమైపోతారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో గత మూడేళ్లుగా రాజస్థానీలు ఇక్కడ గణపతి విగ్రహాలను తయారు చేస్తున్నారు. వివిధ రకాల గణనాథుల విగ్రహలను ఆకర్షణీయంగా తయారు చేస్తు ఉపాధి పొందుతున్నారు. ధర్మారం చుట్టుపక్కల మండలాలకు చెందిన వందలాది మంది భక్తులు వీరి వద్ద విగ్రహాలను కొనుగోలు చేస్తున్నారు. గతంలో ఈ విగ్రహాల కోసం సుదూరంలో ఉన్న కోరుట్ల, మెట్ పల్లి లాంటి ప్రాంతాలకు వెళ్లి విగ్రహాలను తీసుకువచ్చే క్రమంలో సమయంతో పాటు ఖర్చు పెరిగేదని ప్రస్తుతం ధర్మారం మండల కేంద్రంలో గణపతుల విగ్రహాల తయారీ నిర్వాహకులు ఉండటం భక్తులకు ఎంతో సౌకర్యంగా ఉంటుందని ఖర్చు కూడా ఆదా అవుతుందని స్థానికులు అంటున్నారు. ఏడాదంతా పెట్టుబడి పెట్టుకుని కుటుంబ సభ్యులతో కలిసి తయారుచేసిన గణనాథుల విగ్రహాల వల్ల వచ్చే ఆదాయంతో కుటుంబం వెళ్లదీస్తున్నామని రాజస్థానీ కళాకారుడు బాబులాల్ అంటున్నారు. వీరి కళలను ఈ ప్రాంత ప్రజలు ప్రశంసిస్తున్నారు.