కేటీఆర్‌కు పొంగులేటి సవాల్
హైదరాబాద్ (తెలంగాణ వాణి)
హిమాయత్ సాగర్ బఫర్ జోన్‌లో తన ఇల్లు ఉందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించడంపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ మండిపడ్డారు. హైదరాబాద్‌లో శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. తన ఇల్లు ఇంచు ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉన్నా టేప్ పెట్టి కొలిచి కూలగొట్టాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ని కోరారు. దమ్ముంటే కేటీఆర్, హరీశ్ రావు తన ఇల్లు FTL, బఫర్ జోన్‌లో ఉందని నిరూపించాలని ఛాలెంజ్ విసిరారు.
నా ఇల్లు హిమాయత్ సాగర్ బఫర్ జోన్‌లో ఉందని కేటీఆర్ తొత్తులు అంటున్నారు. బీఆర్ఎస్‌తోపాటు ఆ పార్టీ మాజీ నేతలు నాపై బురద జల్లాలని చూస్తున్నారు. సామాన్యులకు ఇబ్బందులు ఎదురుకావొద్దని సీఎం రేవంత్ హైడ్రా ఏర్పాటు చేశారు. బఫర్ జోన్, ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న నిర్మాణాలను బీఆర్ఎస్ సర్కార్ పట్టించుకోలేదు. హైడ్రా ద్వారా ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించాలనేదే మా ఉద్దేశం. ప్రభుత్వ చర్యలపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
హైడ్రాను మంచి ఉద్దేశంతోనే తెచ్చాం.
ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్ పరిధిలోని నిర్మాణాలకు అనుమతించట్లేదు. నిబంధనలు అతిక్రమించిన కట్టడాలనే కూల్చివేస్తున్నాం. అవన్నీ బీఆర్ఎస్ హయాంలో జరిగిన నిర్మాణాలు. నా ఇల్లు అక్రమంగా ఉంటే.. వెంటనే కూల్చివేయాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ను ఆదేశిస్తున్నా. అధికారులకు బదులు బీఆర్ఎస్ నేతలే వెళ్లి కొలతలు తీయండి. అక్రమ కట్టడం అని తేలితే.. కూల్చేయండి” అని పొంగులేటి.. కేటీఆర్‌కు సవాల్ విసిరారు