నిజామాబాద్ (తెలంగాణ ప్రతినిధి) నిజామాబాద్ నగరపాలక సంస్థ మేయర్ గా కాంగ్రెస్ పార్టీకి చెందిన 49వ డివిజన్ కార్పొరేటర్ కూరగాయల ఉమారాణి ఎన్నికయ్యారు. సోమవారం మున్సిపల్ కార్పొరేషన్ లోని సమావేశం హాల్లో కాంగ్రెస్, మజ్లిస్ పార్టీల కార్పొరేటర్లు చేతులెత్తి ఉమారాణి ని మేయర్ గా, డిప్యూటీ మేయర్ గా ఎంఐఎం 54 వ డివిజన్ కార్పొరేటర్ సల్మా తహసీన్ లను ఎన్నుకున్నారు. ముందుగా మున్సిపల్ ఎన్నికల్లో గెలుపొందిన కార్పొరేటర్ల చేత నిజామాబాద్ ఆర్డిఓ ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం మేయర్ ఎన్నిక నిర్వహించారు. కార్పొరేషన్ లోని 14 మంది మజ్లిస్ పార్టీ కార్పోరేటర్ల మద్దతుతో 17 మంది కార్పొరేటర్లు ఉన్న కాంగ్రెస్ పార్టీ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంది. బిఆర్ఎస్ పార్టీ నుండి గెలుపొందిన ఒకే ఒక కార్పొరేటర్ విజయలక్ష్మి కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపారు. మేయర్ పిఠానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 33 కాగా రెండు ఎక్స్ అఫీషియో సభ్యులను కలుపుకొని మొత్తం 34 మంది సభ్యులైయ్యారు. దీంతో అధికారులు నిజామాబాద్ మేయర్ గా కూరగాయల ఉమారాణి ఎన్నికైనట్లు అధికారికంగా ప్రకటించారు. మరోవైపు బీజేపీ 28 మంది కార్పొరేటర్లు ఒక ఎంపీ, ఇద్దరు ఎమ్మెల్యేలు ముగ్గురు ఎక్స్ అఫీషియోల సభ్యులతో 31 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు సోమవారం ఉదయం గెలుపొందిన కార్పొరేటర్లను క్యాంపుల నుండి ప్రత్యేక బస్సుల ద్వారా మున్సిపల్ కార్పొరేషన్ కు తరలించారు.

