UPDATES  

NEWS

 ఎన్నికలు ఏవైనా సిపిఐదే పైచేయి

ప్రజలను మెప్పించేవిధంగా మన పాలన సాగాలి

నిస్వార్థమైన సేవ, పారదర్శక పాలన అందించాలి

సమస్యల పరిష్కారమే ప్రథమ ఎజెండా

ఒంటరి పోరులో అనూహ్య విజయాలు

కొందరు మాటలు జారడం మానుకుంటే మంచిది

ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు

 

కొత్తగూడెం (తెలంగాణ వాణి) గ్రామ పంచాయితీ ఎన్నికల్లో సిపిఐ అజేయ శక్తిగా నిలిచిందని, అవాకులు చెవాకులు పేలిన వారి నోళ్లు ఒక్క సారిగా మూతపడ్డాయని, గెలిచిన సిపిఐ సర్పంచ్లు, వార్డు సభ్యులు నిస్వార్ధంగా, పారదర్శకంగా ప్రజారంజక పాలన అందించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. నూతనంగా గెలుపొందిన సర్పంచ్లు, వార్డుసభ్యుల అభినందన సభ శుక్రవారం స్థానిక కొత్తగూడెం క్లబ్ లో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ముత్యాల విశ్వనాధం అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన కూనంనేని మాట్లాడుతూ గెలిచిన సిపిఐ అభ్యర్థులు ఆయా గ్రామ పంచాయితీల్లోని గ్రామాల అభివృద్ధికి నిరంతరం కృషి చేయాలని, ప్రజా సమస్యల పరిష్కారమే ప్రథమ ఎజెండాగా ఉండాలని సూచించారు. పోటా పోటీగా ఒంటరి పోరుకు దిగిన సిపిఐ జిల్లా వ్యాప్తంగా 47 సర్పంచ్ స్థానాలను మంచి మెజార్టీతో గెలుచుకుందని, అదే విధంగా 57 ఉపనర్పంచ్ పదవులు దక్కించుకోగా, 432 వార్డుల్లో ఎర్రజెండా రెపరెపలాడుతోందన్నారు. మేజర్ గ్రామ పంచాయితీలను సైతం సిపిఐ ఖాతాలో వడ్డాయని తెలిపారు. తాము కాకలు తీరిన రాజకీయ పండితులం అని చెప్పుకునే వారి ప్రాంతాల్లో కూడా సిపిఐ దూసుకుపోయిందని, కొత్తగూడెం నియోజకవర్గంలో కాంగ్రెస్ కంటే సిపిఐకి అత్యధిక ఓట్లు పోలయ్యాయని చెప్పారు. ముగిసిన ఎన్నికల్లో సిపిఐకి కాంగ్రెస్ పార్టీ కనీసం మద్దతు తెలపలేదని, కానీ సిపిఐ స్నేహధర్మాన్ని పాటిస్తూ గతంలో కాంగ్రెస్ నర్పంచ్ లు ఉన్న స్థానాల్లో తాము పోటికి నిలుపలేదని చెప్పారు. అయినప్పటికీ కాంగ్రెస్ నేతలు వ్యక్తిగత దూషణలకు దిగుతూ దిగజారుడు రాజకీయాలు చేశారని, విలువలతో కూడుకున్న రాజకీయాలు, క్రమశిక్షణతో ఉన్న తాము తప్పిదాలకు తావివ్వలేదని చెప్పారు. కొందరు సిపిఐ ది ఏముందిలే, గత అసెంబ్లీ ఎన్నికల్లో తామే గెలిపించాం, వాళ్లకు అంత సీన్ లేదంటూ అవాకులు చెవాకులు పేలారని, కానీ దిమ్మదిరిగే ఫలితాలు సొంత కావడంతో ఇప్పుడు వారు ఎక్కడున్నారో కూడా అంతు చిక్కడం లేదని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా మాటలు జారడం మానుకుని స్నేహ బంధాన్ని నిలుపుకుంటే మంచిదని హితవు పలికారు. త్వరలో జెడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికలు జరగబోతున్నాయని, ఆ తర్వాత మున్సిపాలిటీ, కార్పోరేషన్ ఎన్నికలు జరుగుతాయని చెప్పారు. ఏ ఎన్నికలు వచ్చినా సిపిఐ దే పై చేయని, ఆ నాటి రాజకీయ పరిస్థితులు, ఆయా పార్టీల రాష్ట్ర పెద్దల నిర్ణయాల మేరకు కార్యచరణ ఉంటుందన్నారు. అనంతరం సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కే సాబీర్ పాషా మాట్లాడుతూ గెలిచిన అభ్యర్థులు ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముందుకు సాగాలని, ఓటమి పాలైన వారు కృంగిపోకుండా రానున్న ఎన్నికల్లో సత్తా చాటేందుకు మనోధైర్యాన్ని కూడగట్టుకుని ముందుకు సాగాలని సూచించారు. అనంతరం గెలుపొందిన సర్పంచులు ఉపసర్పంచులతో పాటు వార్డు సభ్యులకు మెమొంటోలు అందజేసి శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కల్లూరి వెంకటేశ్వరరావు, జిల్లా కార్యవర్గసభ్యులు సలిగంటి శ్రీనివాస్, నరాటి ప్రసాద్, సరెడ్డి పుల్లారెడ్డి, దుర్గారాసి వెంకటేశ్వర్లు, వి.పూర్ణచందర్ రావు, మున్నా లక్ష్మికుమారి, కే సారయ్య, చంద్రగిరి శ్రీనివాసరావు, రేసు ఎల్లయ్య, ఎస్ డి సలీం, చండ్ర నరేంద్ర కుమార్, వాసిరెడ్డి మురళి, మువ్వా వెంకటేశ్వరరావు, బంధం నాగయ్య, ఉప్పుశెట్టి రాహుల్, మండల కార్యదర్శులు, జిల్లా సమితి సభ్యులు, నూతన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest