భార్యను హత్య చేసి గోదావరిలో పడేసిన భర్త!
మిస్సింగ్ కేసు దర్యాప్తులో వెలుగులోకి దారుణం..
తండ్రి సహకారంతో మృతదేహం తరలింపు
పోలీసుల గాలింపులో భవాని మృతదేహం గుర్తింపు.. నిందితుడు అరెస్ట్
వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్
కొత్తగూడెం, (తెలంగాణ వాణి) భార్య కనిపించడం లేదంటూ నమోదైన అదృశ్యం కేసు చివరకు హత్యోదంతంగా వెలుగులోకి వచ్చింది. భార్యను హత్య చేసిన భర్త, మృతదేహాన్ని గోదావరి నదిలో పడవేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. నిందితుడు ఇచ్చిన సమాచారంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి గోదావరి నదిలో భవాని మృతదేహాన్ని గుర్తించారు. జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ తెలిపిన వివరాల ప్రకారం.. గుండారపు స్వరూప తన సోదరి భవాని కనిపించడం లేదని నవంబర్ 6న కొత్తగూడెం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో క్రైమ్ నంబర్ 205/2026 కింద అదృశ్యం కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో భవాని భర్త బోడా నరేందర్ (30)ను విచారించగా అసలు విషయం బయటపడింది. నవంబర్ 3వ తేదీ రాత్రి సుమారు 8 గంటల సమయంలో అద్దె ఇంట్లో భార్య భవానిని చేతులతో నులిమి, చున్నీతో గొంతు బిగించి హత్య చేసినట్లు నరేందర్ విచారణలో అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం మృతదేహాన్ని తెల్లని సంచిలో ఉంచి తన స్వగ్రామమైన టేకులపల్లి మండలం గోలియాతండాకు తీసుకెళ్లి, తండ్రి హరిలాల్ సహాయంతో వ్యవసాయ పొలంలో దాచిపెట్టినట్లు వెల్లడించారు. ఆ తర్వాత నవంబర్ 4వ తేదీ రాత్రి సుమారు 11 గంటలకు తండ్రి సహాయంతో మృతదేహాన్ని ద్విచక్ర వాహనంపై భద్రాచలం గోదావరి వంతెన వద్దకు తీసుకెళ్లి నదిలో పడవేసినట్లు విచారణలో తెలిపాడు. నేరానికి సంబంధించిన ఆధారాలను మాయం చేసేందుకే ఈ చర్యకు పాల్పడినట్లు పోలీసులు పేర్కొన్నారు. నిందితుడు వెల్లడించిన వివరాల ఆధారంగా పంచుల సమక్షంలో గోదావరి నదిలో విస్తృతంగా గాలింపు చేపట్టిన పోలీసులు భవాని మృతదేహాన్ని గుర్తించారు. ప్రధాన నిందితుడు బోడా నరేందర్‌ను కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించనున్నట్లు తెలిపారు. ఈ ఘటనలో ఇతరుల ప్రమేయంపై కూడా తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని వెల్లడించారు. నేరంలో ప్రమేయం ఉన్న వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ స్పష్టం చేశారు. కేసు దర్యాప్తులో కీలకంగా వ్యవహరించిన కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణ, చుంచుపల్లి సీఐ ఆర్. వెంకటేశ్వర్లు, త్రీ టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి, వన్ టౌన్ సీఐ జితేందర్, అన్నపురెడ్డిపల్లి ఎస్ఐ విజయ్ సింహారెడ్డి, త్రీ టౌన్ ఎస్ఐ రమేష్‌తో పాటు పోలీసు సిబ్బందిని ఎస్పీ అభినందించారు.




