జర్నలిస్టు కాలనీకి మౌలిక సదుపాయాలు త్వరలో కల్పిస్తాం..
ప్రజా పాలన ప్రభుత్వంలో జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి ఉంటాం
మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు
వేములవాడ,ఆగస్టు 23 (తెలంగాణ వాణి ప్రతినిధి) :
జర్నలిస్టు కాలనీలో మౌలిక సదుపాయాలను త్వరలోనే కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని వేములవాడ మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు అన్నారు. ఆదివారం మున్సిపల్ వైస్ చైర్మన్ నరాల శేఖర్, ఆరో వార్డు కౌన్సిలర్ కాస శ్రీనివాసులతో కలిసి నాంపల్లి శివారులోని జర్నలిస్టు కాలనీని వారు సందర్శించారు.వేములవాడ మున్సిపాలిటీ పరిధిలోని ఆరో వార్డులో, నాంపల్లి శివారులో 391 సర్వే నంబర్లో ప్రభుత్వం జర్నలిస్టులకు నివేశన స్థలాలను కేటాయించిన విషయం తెలిసిందే. గత మూడేళ్లుగా పలువురు జర్నలిస్టులు కాలనీలో ఇళ్ల నిర్మాణాలను చేపడుతున్నారు. అయితే విద్యుత్, డ్రైనేజీ, తాగునీరు,రోడ్లు తదితర మౌలిక సదుపాయాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే,ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ దృష్టికి జర్నలిస్టులు తీసుకెళ్లారు.స్పందించిన ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ జర్నలిస్టు కాలనీని సందర్శించి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని మున్సిపల్ చైర్మన్‌ను ఆదేశించారు. ఈ నేపథ్యంలో కాలనీని సందర్శించిన పుల్కం రాజు మాట్లాడుతూ ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా నిలుస్తూ ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొచ్చే జర్నలిస్టుల కాలనీలో అవసరమైన మౌలిక సదుపాయాలను తక్షణమే కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.వైస్ చైర్మన్ నరాల శేఖర్, ఆరో వార్డు కౌన్సిలర్ కాస శ్రీనివాసులు మాట్లాడుతూ కాలనీలో నెలకొన్న సమస్యలను పరిశీలించి సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకొని పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.ఈ సందర్భంగా టీయూడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షులు లాయక్ పాషా మాట్లాడుతూ గత ప్రభుత్వం జర్నలిస్టులకు నివేశన స్థలాలను కేటాయించిందని, ప్రస్తుత ప్రభుత్వం కాలనీలో మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు పెండింగ్‌లో ఉన్న జర్నలిస్టుల నివేశన స్థలాల సమస్యలను కూడా పరిష్కరించాలని కోరారు.అనంతరం కార్యక్రమానికి హాజరైన మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, వైస్ చైర్మన్ నరాల శేఖర్, కౌన్సిలర్ కాస శ్రీనివాసులను ప్రెస్ క్లబ్ అధ్యక్షులు రాపల్లి శ్రీనివాస్ శాలువాలతో సత్కరించి ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో జర్నలిస్టు కాలనీకి చెందిన పలువురు విలేకరులు పాల్గొన్నారు.


