75 మందికి పరీక్షలు.. 20 మందికి షుగర్ నిర్ధారణ – మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు పిలుపు
ధర్మారం (తెలంగాణ వాణి) పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని మల్లన్నగుట్ట సమీపంలోని క్రీడా తెలంగాణ ప్రాంగణంలో ఆదివారం ధర్మారం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత డయాబెటిస్ (షుగర్) నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. లయన్స్ క్లబ్ అధ్యక్షులు చింతపండు నర్సింగం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిబిరంలో వాకర్స్ అసోసియేషన్‌కు చెందిన 75 మందికి షుగర్ పరీక్షలు నిర్వహించగా, వారిలో 20 మందికి మధుమేహ లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు. అనంతరం క్రీడా ప్రాంగణంలో లయన్స్ క్లబ్ సభ్యులు మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు తమ వంతు బాధ్యతను చాటారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ అధ్యక్షులు చింతపండు నర్సింగం మాట్లాడుతూ, ప్రజల్లో ఆరోగ్య చైతన్యం పెంపొందించేందుకు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిరంతరం నిర్వహిస్తున్నామని తెలిపారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని, ఖాళీ స్థలాలు, పాఠశాలలు, రహదారుల వెంట నీడనిచ్చే, పండ్ల చెట్లను పెంచాలని సూచించారు.
మధుమేహం రాకుండా ఉండాలన్నా, ఇప్పటికే ఉన్న వారు అదుపులో ఉంచుకోవాలన్నా ప్రతిరోజూ వ్యాయామం, వాకింగ్ చేయడం, మితాహారం తీసుకోవడం, రాత్రి 7 గంటలలోపు భోజనం చేయడం అలవాటు చేసుకోవాలని సూచించారు. అలాగే మద్యపానం, ధూమపానానికి దూరంగా ఉండాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జెడ్సీ లయన్ తలమక్కి రవీందర్ శెట్టి, కార్యదర్శి లయన్ కట్ట రమేష్, కోశాధికారి లయన్ కడారి కుమార్, వైస్ ప్రెసిడెంట్-1 లయన్ బొట్ల లక్ష్మీనరసయ్య, నాడెం శ్రీనివాస్, సాలాంద్రి వాకర్స్ అసోసియేషన్ శిక్షకులు దేవి రాజలింగు, నూనె సత్యనారాయణ, వన్నెల బాల్‌రెడ్డి, దాగేటి కొమురయ్య, బోయిని మల్లేశం తదితరులు పాల్గొన్నారు.
