వైన్స్ ముందు శవాన్ని పెట్టి కుటుంబ సభ్యుల ధర్నా
నారాయణఖేడ్/ పెద్ద శంకరంపేట్ మే:18 (తెలంగాణ వాణి ప్రతినిధి) పెద్ద శంకరంపేట పట్టణంలోని శంకరంపేట వైన్స్ సిట్టింగ్ రూమ్ లో వ్యక్తి మృతి చెందిన సంఘటన ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే సంగారెడ్డి జిల్లా నిజాంపేట మండలం బాచపల్లి గ్రామానికి చెందిన ఎర్రోళ్ల అశోక్ (40) ఆదివారం సాయంత్రం శంకరంపేట వైన్స్ లో మందు తీసుకొని పర్మిట్ రూంలో మద్యం సేవించి అకస్మాత్తుగా మరణించడంతో పెద్ద శంకరంపేటలో కలకలం రేపింది. మృతికి వైన్ షాప్ యాజమాన్యమే కారణమని వైన్స్ ముందు శవాన్ని పెట్టి మృతుని బంధువులు ధర్నాకు దిగారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఏ ఎస్ఐ చంద్రమోహన్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపడుతున్నారు. శంకరంపేట వైన్స్ ప్రధాన రహదారిపై ఉండడంతో వాహన చోదకులు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలుమార్లు ఎక్సైజ్ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎక్సైజ్ అధికారులు పట్టించుకోవడంలేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైన్స్ పర్మిట్ రూంలోనే మద్యం సేవించడం వెంటనే అక్కడికక్కడే వ్యక్తి మృతి చెందడం పట్ల పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

