తిమ్మాపూర్ అక్టోబర్ 11 (తెలంగాణ వాణి ప్రతినిధి) :మోటార్ల చోరీ కేసులో పోలీసుల విచారణ ఎదుర్కొంటున్న ఓ యువకుడు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని ఎల్ఎండీ పోలీస్‌స్టేషన్ భవనంపై నుంచి కిందకు దూకిన ఘటన కలకలం రేపింది. తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీకి చెందిన కిన్నెర అజయ్ ఈ ఘటనలో గాయపడటంతో పోలీసులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. విచారణ పేరుతో పోలీసులు కొట్టడంతో భయపడి తమ కుమారుడు దూకాడని కుటుంబ సభ్యులు ఆరోపించగా.. అజయ్ క్షేమంగా ఉన్నాడని, వైద్య పరీక్షల అనంతరం నోటీసులిచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు కరీంనగర్ రూరల్ ఏసీపీ విజయ్‌కుమార్ తెలిపారు.
మోటార్ల చోరీ కేసులో విచారణ :
రామకృష్ణ కాలనీలో మోటార్ల చోరీకి సంబంధించి కిన్నెర అజయ్‌తో పాటు మనోజ్, లింగస్వామి, సాయి తదితరులపై ఫిర్యాదులు రావడంతో ఎల్ఎండీ పోలీసులు విచారణ చేపట్టారు. గతంలోనూ వీరిపై రెండు కేసులు నమోదైనట్లు సమాచారం. ఈ నెల 9న మోటార్ల చోరీకి సంబంధించి ఎల్ఎండీ పోలీస్‌స్టేషన్‌లో మరో కేసు నమోదైంది. ఈ కేసులో నలుగురిని పోలీసులు విచారించారు.
కొట్టడంతోనే దూకాడని ఆరోపణలు :
విచారణ సమయంలో నేరాన్ని అంగీకరించాలని పోలీసులు కొట్టారని, మరిన్ని నేరాలు ఒప్పుకోవాలంటూ కాళ్లపై దెబ్బలు కొట్టారని బాధితుల కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ క్రమంలో భయాందోళనకు గురైన అజయ్ పోలీస్‌స్టేషన్ భవనంపై నుంచి కిందకు దూకినట్లు పేర్కొన్నారు. అయితే, విచారణలో భాగంగా మోటార్ల చోరీకి పాల్పడినట్లు అంగీకరించడంతో భయపడి అజయ్ దూకినట్లు ఏసీపీ విజయ్‌కుమార్ వెల్లడించారు. అతడు క్షేమంగా ఉన్నాడని, వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం నోటీసులు జారీ చేసి కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు తెలిపారు.
స్టేషన్‌కు చేరుకున్న కుటుంబ సభ్యులు :
ఈ ఘటన విషయం తెలుసుకున్న అజయ్ కుటుంబ సభ్యులు, బంధువులు పెద్ద సంఖ్యలో ఎల్ఎండీ పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని ఆందోళనకు దిగారు. అరెస్ట్ చూపకుండానే తమ కుమారుడిని స్టేషన్లో ఉంచి పోలీసులు తీవ్ర చిత్రహింసలకు (థర్డ్ డిగ్రీ) గురి చేశారని బాధితుడు అజయ్ కుటుంబ సభ్యులు తీవ్ర ఆరోపణలు చేశారు.పోలీసులు కొట్టడం వల్లే తమ కుమారుడు భయపడి భవనంపై నుంచి దూకాడని ఆరోపించారు. ఘటనపై ఆందోళన వ్యక్తం చేయడంతో మానకొండూరు సీఐ శ్రీలత, కొత్తపల్లి సీఐ బిల్లా కోటేశ్వర్ పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని కుటుంబ సభ్యులకు సర్దిచెప్పారు. అనంతరం చోరీ కేసులో విచారణ ఎదుర్కొంటున్న యువకులకు నోటీసులు జారీ చేసి వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు.
పోలీసుల తీరుపై చర్చ :
పోలీస్‌స్టేషన్‌లో విచారణ జరుగుతున్న సమయంలో యువకుడు భవనంపై నుంచి దూకడం స్థానికంగా చర్చనీయాంశమైంది. పోలీసుల వేధింపులపై కుటుంబ సభ్యులు ఆరోపణలు చేయగా, అజయ్ క్షేమంగా ఉన్నాడని పోలీసులు తెలిపారు.



