మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన ముగ్గురు ఎమ్మెల్యేలు
డిప్యూటీ స్పీకర్ గా ఒకరు
హైదరాబాద్ (తెలంగాణ వాణి)
తెలంగాణ ప్రభుత్వంలో కొత్తగా ముగ్గురు మంత్రులు బాధ్యతలు స్వీకరించారు. ఇవాళ మధ్యాహ్న రాజభవన్ లో ఎమ్మెల్యేలు వివేక్ వెంకటస్వామి, వాకిటి శ్రీహరి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ లతో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రమాణ స్వీకారం చేయించారు. వీరితో పాటు శాసనసభ డిప్యూటీ స్పీకర్ గా రామ చంద్రునాయక్ తో ప్రమాణస్వీకారం చేయించారు. ఈ సందర్భంగా నూతన మంత్రులుగా బాధ్యతలు స్వీకరించిన వివేక్, అడ్లూరి లక్ష్మణ్, వాకిటి శ్రీహరి, శాసనసభ ఉప సభాపతి బాధ్యతలు స్వీకరించిన రామచంద్రు నాయక్ లకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తదితరులు పాల్గొన్నారు.
సామాజిక న్యాయం ఇందిరమ్మ ప్రభుత్వంతోనే సాధ్యం అని సీఎం రేవంత్ సహా పలువురు మంత్రులు పదే పదే చెప్పినట్టుగానే కాంగ్రెస్ అధిష్టానం సామాజిక న్యాయాన్ని పరిగణనలోకి తీసుకుని ఇద్దరు ఎస్సీ, ఒక ఎస్టీ, ఒక బీసీ ఎమ్మెల్యేలకు మంత్రివర్గంలోకి తీసుకున్నారు.