కరీంనగర్ టౌన్ నవంబర్ 07 (తెలంగాణ వాణి ప్రతినిధి ) :తిమ్మాపూర్ మండల పరిధిలోని వచ్చనూర్ గ్రామంలో ఒంటరిగా నివసిస్తున్న వృద్ధ మహిళలను లక్ష్యంగా చేసుకుని, వారి వద్దనున్న బంగారు, వెండి ఆభరణాలను దోచుకునేందుకు దారుణంగా హత్యలు చేసిన కేసులో నలుగురు నిందితులను పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. మరొక నిందితుడు పరారీలో ఉన్నాడు. కరీంనగర్ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు రూరల్ ఏసీపీ పర్యవేక్షణలో తిమ్మాపూర్ సీఐ, ఎస్సైలు మరియు సిబ్బంది ఈ కేసును చాకచక్యంగా ఛేదించారు.గత ఆగస్టు 16న వచ్చనూర్ గ్రామానికి చెందిన ఒంటరి వృద్ధురాలు ఉప్పులేటి భూదమ్మ (103) ఇంట్లోకి మొదటి నిందితుడు మద్దూరి సాయి తన సహచరులతో కలిసి ప్రవేశించి, ఆమెకు ఊపిరాడకుండా చేసి హత్య చేశారు.అనంతరం ఆమె ఒంటిపై ఉన్న వెండి కడియాలు, బంగారు ముక్కుపుడకలను దొంగిలించారు. మృతురాలి కుటుంబ సభ్యులు ఆమె వృద్ధాప్యం కారణంగా సహజంగానే మరణించిందని భావించి అంత్యక్రియలు నిర్వహించారు. దొంగిలించిన వస్తువులను పవన్ సహాయంతో మణికంఠ అనే వ్యక్తికి విక్రయించి నగదును పంచుకున్నారు. తొలి హత్యలో ఎవరికీ అనుమానం రాకపోవడంతో నిందితులు అక్టోబర్ 31న మరో నేరానికి పాల్పడ్డారు.అదే గ్రామానికి చెందిన ఒంటరి వృద్ధురాలు ఉప్పులేటి లక్ష్మి అలియాస్ లచ్చవ్వ (80) ఇంట్లోకి చొరబడి, ఆమెను ఊపిరాడకుండా చేసి హతమార్చారు. ఆమె వద్దనున్న వెండి కడియాలు, బంగారు నల్లపూసల గొలుసు, చెవికమ్మలను అపహరించారు. వీటిలో కొన్నింటిని కరీంనగర్లో, మిగతా బంగారు నగలని హైదరాబాద్లోని ఉప్పల్ ప్రాంతంలో అమ్మి సొమ్ము చేసుకున్నారు.వృద్ధురాలి అనుమానాస్పద మృతిపై లోతుగా దర్యాప్తు జరిపిన పోలీసులు, శనివారం మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో అలుగునూరు చౌరస్తా వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు.తిమ్మాపూర్ వైపు నుంచి వస్తున్న స్కూటీని ఆపి విచారించగా ఇద్దరు నిందితులు పట్టుబడ్డారు. విచారణలో వచ్చనూర్లో జరిగిన రెండు హత్యలు తామే చేసినట్లు వారు అంగీకరించారు. అనంతరం మూడో నిందితుడు ఎల్కతుర్తి రాజును హౌసింగ్ బోర్డు కాలనీ సమీపంలోని క్యాన్సర్ ఆసుపత్రి వద్ద అదుపులోకి తీసుకున్నారు.అరెస్టయిన నిందితులు మద్దూరి సాయి (24), తండ్రి: నారాయణ, నివాసం: వచ్చనూర్, తిమ్మాపూర్. కిన్నెర రాజు (25), తండ్రి: రాములు, పోరండ్ల, తిమ్మాపూర్. ఎల్కతుర్తి రాజు (25), తండ్రి: కొమురయ్య, కొత్తపల్లి, తిమ్మాపూర్, మానుకోల పవన్ కుమార్ అలియాస్ జాక్ (28), వచ్చనూర్, మరో నిందితుడు కనపర్తి మణికంఠ (28), గుండ్లపల్లి, గన్నేరువరం ప్రస్తుతం పరారీలో ఉన్నాడు.స్వాధీనం చేసుకున్న వాహనాలు టీవీఎస్ జూపిటర్ స్కూటీ టీఎస్ 02 ఈ హెచ్ 5726, బజాజ్ పల్సర్ మోటార్ సైకిల్ టీఎస్ 02 ఎఫ్ఎల్ 4868, కాళ్ళ వెండి కడియాలు, చేతి వెండి కడియాలు, 5 మొబైల్ ఫోన్లు, ఒక ఇనుప గొట్టం, స్టీల్ పట్టుకారును స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును సమర్థవంతంగా ఛేదించిన రూరల్ ఏసీపీ, తిమ్మాపూర్ సీఐ, ఎల్ఎండీ కాలనీ, గన్నేరువరం, చిగురుమామిడి ఎస్సైలు మరియు పోలీస్ సిబ్బందిని పోలీస్ కమిషనర్ ప్రత్యేకంగా అభినందించారు.గ్రామీణ ప్రాంతాల్లో వృద్ధ మహిళలు ఒంటరిగా నివసించకుండా కుటుంబ సభ్యులతో కలిసి ఉండాలని పోలీసులు సూచించారు. బంగారం, వెండి ధరలు అధికంగా ఉన్నందున వృద్ధ మహిళలు ఒంటిపై విలువైన ఆభరణాలు ధరించకుండా జాగ్రత్త వహించాలని కోరారు. చెడు వ్యసనాలకు బానిసలై తిరిగే యువకుల సమాచారాన్ని పోలీసులకు అందిస్తే కౌన్సిలింగ్ నిర్వహించి డి-అడిక్షన్ సెంటర్లకు తరలిస్తామని, వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. నేరాల నియంత్రణకు ప్రతి గ్రామంలో స్వచ్ఛందంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.




