ధర్మారం, (తెలంగాణ వాణి ప్రతినిధి )
ధర్మారం – కరీంనగర్ ప్రధాన రహదారిలోని ఎర్రగుంటపల్లి శివారులో గల దుర్గామాత ఆలయంలో శుక్రవారం అర్ధరాత్రి చోరీ జరిగింది. ఆలయ తాళం పగలగొట్టి గర్భాలయంలోకి ప్రవేశించిన దొంగలు అమ్మవారి వెండి హారాలు, బంగారు ముక్కుపుడక, హుండీ సొమ్మునుఅపహరించుకుపోయారు.విషయం తెలుసుకున్న ఆలయ కమిటీ సభ్యులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అయితే ఆలయంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు కొంతకాలంగా పనిచేయడం లేదని తెలిసింది. దీంతో దొంగల ఆచూకీ కనిపెట్టడం పోలీసులకు సవాలుగా మారింది.గతంలోనూ ఇదే ఆలయంలో చోరీ జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. ఆలయాల్లో భద్రత పెంచాలని, దొంగలను త్వరగా పట్టుకోవాలని భక్తులు కోరుతున్నారు.




