తిమ్మాపూర్, నవంబర్ 23 (తెలంగాణ వాణి ప్రతినిధి):తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీలోని మహాత్మా జ్యోతిబా పూలే (ఎంజేపీ) బీసీ బాలుర గురుకుల పాఠశాల, జూనియర్ కళాశాలలో విద్యార్థుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థిపై ఆరుగురు ద్వితీయ సంవత్సరం విద్యార్థులు దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.ఈ నెల 17న జూనియర్, సీనియర్ విద్యార్థుల మధ్య తలెత్తిన వివాదం కొట్లాటకు దారితీసినట్లు సమాచారం. దీంతో సదరు విద్యార్థి తండ్రి కళాశాలకు చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చెప్పినట్లు తెలిసింది. అయితే ఇన్చార్జి ప్రిన్సిపాల్ జోక్యం చేసుకుని ఫిర్యాదు చేయవద్దని నచ్చజెప్పినట్లు సమాచారం. అనంతరం ఈ నెల 19న దాడికి పాల్పడిన విద్యార్థులను ఇంటికి పంపించినట్లు తెలిసింది.విద్యార్థుల మధ్య ఘర్షణ చోటుచేసుకోవడం, ఈ ఘటనపై యాజమాన్యం తీసుకున్న చర్యలు చర్చనీయాంశంగా మారాయి.





