సిరిసిల్ల జిల్లాలో మోగిన ‘రైలు కూత’
బస్వాపూర్ వరకు విజయవంతంగా ట్రయల్ రన్!

రాజన్న సిరిసిల్ల,ఆగస్టు 30,(తెలంగాణ వాణి ప్రతినిధి): కొత్తపల్లి-మనోహరాబాద్ నూతన రైల్వే లైన్ నిర్మాణ పనుల్లో భాగంగా, జిల్లా సరిహద్దులోని తంగళ్ళపల్లి మండలం బస్వాపూర్ రైల్వే స్టేషన్ వరకు నిర్వహించిన రైల్వే ట్రయల్ రన్ విజయవంతమైంది. తొలిసారిగా జిల్లా సరిహద్దు ప్రాంతంలోకి రైలు వచ్చి కూత పెట్టడంతో స్థానిక ప్రజలు, రైతులు ఆనందంలో మునిగిపోయారు. సిద్దిపేట మార్గం నుంచి బస్వాపూర్ స్టేషన్ వరకు రైల్వే అధికారులు ఇంజిన్ను నడిపి పట్టాలు, సిగ్నలింగ్ వ్యవస్థ పనితీరును క్షేత్రస్థాయిలో పరిశీలించారు.దశాబ్దాలుగా రైలు సౌకర్యం కోసం నిరీక్షిస్తున్న గిరిజన, గ్రామీణ ప్రాంత ప్రజలు రైలు రాకను చూసి హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. రైల్వే అధికారులకు పటాకులు కాల్చి, మిఠాయిలు తినిపించి స్వాగతం పలికారు. ఈ మార్గం పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే సిరిసిల్లలోని చేనేత, జౌళి ఉత్పత్తుల రవాణాకు కొత్త ఊపిరి అందడమే కాకుండా, వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి దర్శనానికి వచ్చే భక్తులకు రవాణా కష్టాలు తప్పనున్నాయి. త్వరలోనే సిరిసిల్ల పట్టణ శివారు వరకు పనులు పూర్తి చేసి ప్రయాణికుల రైళ్లను అందుబాటులోకి తెస్తామని అధికారులు తెలిపారు.




