జిల్లెలగడ్డ గ్రామ శివారులోని గురుకుల పాఠశాలలోని ఘటన
శోక సముద్రంలో మునిగిన తల్లితండ్రులు…
హుస్నాబాద్: అక్టోబర్ 7
తెలంగాణ వాణి రూరల్ ప్రతినిది
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం జిల్లెల్లగడ్డలోని సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థి వివేక్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. దసరా సెలవుల అనంతరం వివేక్ ఈనెల 6న తిరిగి పాఠశాలకు వచ్చాడు. మంగళవారం ఉదయం పాఠశాల భవనం రెండో అంతస్తు కారిడార్లో ఆడుకుంటున్న సమయంలో అక్కడ ఉన్న తాడు మెడకు చుట్టుకోవడంతో కిందపడ్డాడు. దీనితో మెడకు ఉరి బిగుసుకుంది. అపస్మారక స్థితిలో ఉన్న విద్యార్థిని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరీక్షించి వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.
పాఠశాలలో ఆడుకుంటున్న సమయంలో ప్రమాదవశాత్తు ఈ ఘటన జరిగిందని ఉపాధ్యాయులు చెప్తున్నారు. ఇదిలా ఉండగా పాఠశాలలో ఆడుకుంటున్న సమయంలో కింద పడటంతో గాయాలయ్యాయని, హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చినట్లు ఉపాధ్యాయులు తమకు సమాచారం అందించారని విద్యార్థి తండ్రి తెలిపారు. తాము ఇక్కడికి వచ్చేసరికి తమ కుమారుడు చనిపోయి ఉన్నాడని తెలిపారు. ఉపాధ్యాయులు తెలిపిన ప్రకారం ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగిందా లేదా విద్యార్థి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడా అనేది తెలియాల్సి ఉంది. విషయం తెలుసుకున్న హుస్నాబాద్ పోలీసులు పాఠశాలకు వెళ్లి విచారణ చేపట్టారు.



