UPDATES  

 తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల జీవో విడుదల

హైదరాబాద్ (తెలంగాణ వాణి) తెలంగాణలో పల్లె, పట్టణ స్థానిక సంస్థల్లో బీసీలకు భారీగా రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ జి.ఓ నెం.9ను శుక్రవారం విడుదల చేసింది. ఈ రిజర్వేషన్ల ఆధారంగా రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. శనివారం ఉదయం ముఖ్య కార్యదర్శి, డీజీపీ, ఉన్నతాధికారులతో రాష్ట్ర ఎన్నికల సంఘం సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్, భద్రతా ఏర్పాట్లపై చర్చించనున్నారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో బుసాని వెంకటేశ్వరరావు కమిటీ సిఫారసులను ప్రభుత్వం ఆమోదించింది. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన సమగ్ర సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ సర్వే ఆధారంగా 42% రిజర్వేషన్లు నిర్ణయించబడ్డాయి. ఆర్టికల్స్ 40, 243D, 243Tతో పాటు డైరెక్టివ్ ప్రిన్సిపిల్స్ ప్రకారం ఈ రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. నూతన పీఆర్‌ చట్టానికి అసెంబ్లీ ఆమోదించిన సవరణలకు అనుగుణంగా డెడికేటెడ్‌ కమిషన్‌ సిఫార్సుల ప్రకారం వార్డు సభ్యులు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ఎంపీపీ అధ్యక్షులు, జెడ్‌పీటీసీలు, జెడ్పీ చైర్మన్‌ పదవులకు రిజర్వేషన్లను ఖరారు చేసిన విషయం తెలిసిందే. ఎస్టీ, ఎస్సీ, బీసీలు ఇలా అన్ని కేటగిరీల్లో మహిళలకు 50 శాతం రిజర్వ్‌ చేశారు. షెడ్యూల్డ్‌ ఏరియాల్లో రిజర్వేషన్‌ సీట్లన్నీ కూడా ఎస్టీల జనాభా నిష్పత్తికి అనుగుణంగా, మొత్తం సీట్లలో 50 శాతానికి తగ్గకుండా చేశారు. ఈ ఏరియాల్లోని మండల అధ్యక్షుల పదవులన్నీ కూడా ఎస్టీలకే రిజర్వ్‌ చేశారు. జెడ్పీ చైర్‌పర్సన్‌ రిజర్వేషన్ల ఖరారును పంచాయతీరాజ్‌ కమిషనర్, మండల అధ్యక్షులు, జెడ్పీటీసీ స్థానాలను జిల్లా కలెక్టర్లు, మండలాల్లో ఎంపీటీసీ రిజర్వేషన్లను ఆర్డీవోలు ఖరారు చేశారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను 2011 జనాభా లెక్కల ఆధారంగా.. బీసీ రిజర్వేషన్లను కులగణన (ఎస్‌ఈఈఈపీసీ) సర్వే 2024 ప్రకారం పూర్తి చేశారు

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest