హైదరాబాద్ (తెలంగాణ వాణి కరస్పాండెంట్)
ఆణువణువూ దేశభక్తి నింపుకున్న వ్యాపార దిగ్గజం రతన్ టాటా మరణ వార్త దేశ ప్రముఖులనే కాక సామాన్య ప్రజలను కూడా షాక్ కు గురి చేసింది. గత కొన్ని రోజులు ముంబయిలోని ఓ ఆసుపత్రిలో అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బుధవారం అర్థరాత్రి తుది శ్వాస విడిచారు. కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యతో బాధపడుతోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే గత ముంబయిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వ్యాపార సామ్రాజ్యంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న రతన్ టాటా కేవలం వ్యాపారంలోనే కాకుండా దాతృత్వంలో కూడా తనకు ఎవరు సాటిలేరని నిరూపించుకున్నారు. 1937 డిసెంబర్ 28న నావల్ టాటా – సోనీ టాటా దంపతులకు రతన్ టాటా జన్మించారు. 1991 సంవత్సరంలో రతన్ టాటా టాటా గ్రూప్ చైర్మన్ అయ్యారు. ఆ తర్వాత ఆయన వెనుదిరిగి చూడలేదు. 10 వేల కోట్లుగా ఉన్న టాటా పారిశ్రామిక సామ్రాజ్యాన్ని లక్ష కోట్లకు తీసుకెళ్లడంలో ఆయన కృషి ఎంతో ఉంది. భారతదేశంలో అత్యంత గౌరవనీయమైన పారిశ్రామికవేత్తలలో రతన్ టాటా ఒకరు. ఆయన నాయకత్వంలో టాటా గ్రూప్ అనేక ముఖ్యమైన విజయాలను సాధించింది. రతన్ టాటాకు 2000లో పద్మభూషణ్, 2008లో పద్మవిభూషణ్, దేశం రెండవ అత్యున్నత పౌర పురస్కారాలు లభించాయి.