UPDATES  

NEWS

 మాజీ మంత్రి హరీష్ రావుపై మరో కేసు నమోదు 

నాకు ప్రాణహాని ఉందంటున్న చక్రధర్ గౌడ్

హైదరాబాద్ (తెలంగాణ వాణి)

బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావుపై మరో కేసు నమోదు అయింది. బాచుపల్లి పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. హరీష్ రావు, ఆయన అనుచరులు బెదిరిస్తున్నారని కాంగ్రెస్ నేత చక్రధర్ గౌడ్ బాచుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఏ -1 గా వంశీ కృష్ణ, ఏ -2 గా హరీష్ రావు, ఏ-3 సంతోష్ కుమార్, ఏ -4 గా పరుశురాములు పేర్లు చేర్చారు. బీఎస్ఎన్ యాక్ట్ (BSN Act) ప్రకారం కేసు నమోదు చేసిన బాచుపల్లి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

 

ఫోన్ ట్యాపింగ్ కేసులో అరస్టయి బెయిల్‌పై విడుదల అయిన సమయంలో వంశీకృష్ణ జైలు వద్ద మీడియాతో మాట్లాడారని దర్యాప్తు చేస్తున్న పంజాగుట్ట పోలీసులను విమర్శించడంతోపాటు తనపై ప్రతీకారం తీర్చుకుంటామని వంశీకృష్ట మాట్లాడినట్లు చక్రధర్ గౌడ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే వంశీకృష్ణ చేసిన వ్యాఖ్యల్లో ఎలాంటి అభ్యంతకరమైన మాటలు లేవని తనను అక్రమంగా కేసులు పెట్టి జైలుకు పంపించారని న్యాయపోరాటం కొనసాగిస్తానని చెప్పడంవలనే తనపై అక్రమంగా కేసులు పెట్టారని వంశీ చెబుతున్నారు. కాగా ఈ కేసుకు సంబంధించి పోలీసుల దర్యాప్తు ఎలా ఉండబోతోందో చూడాలి. గత ప్రభుత్వానికి అడ్డు తగిలిన వ్యక్తులను ఒక్కొక్కరిగా చంపేసుకుంటూ వస్తున్నారని, వాళ్లకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉందని ఆ పార్టీ నేత చక్రధర్ గౌడ్ అన్నారు. తనకూ ప్రాణహాని ఉందని తన అంతుచూస్తామంటూ సోషల్ మీడియా వేదికగా బెదిరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సమాజం కోసం కొట్లాడుతున్న గొంతుకలను కాపాడుకోవాల్సిన అవసరం అందరిపై ఉందన్నారు. చావు ఏదో ఒకరోజు తప్పదు. కానీ సమాజం కోసం పోరాడి చావడానికి సిద్ధమేనన్నారు. ఫోన్ ట్యాపింగ్ ద్వారా వ్యక్తి స్వేచ్ఛను హరించారని కోర్టు మెట్లెక్కిన మొట్టమొదటి వ్యక్తిని తానేనన్నారు. కేసు వెనక్కి తీసుకోమని కొన్ని శక్తులు తనను వెంటాడుతున్నాయన్నారు. ఈ క్రమంలో తనకు ఏమౌతుందోనని తన కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారని ఆయన అన్నారు. కాగా మాజీ మంత్రి హరీష్‌రావు తన ఫోన్‌తో పాటు కుటుంబ సభ్యులు, స్నేహితుల ఫోన్‌లను ట్యాప్‌ చేయించాడని సిద్దిపేట కాంగ్రెస్‌ నేత చక్రధర్‌గౌడ్‌ ఆరోపించారు. తన ఫోన్‌ ట్యాప్‌ అయిందంటూ గత ఏడాది జూన్‌ 19న చక్రధర్‌గౌడ్‌ డీజీపీకి ఫిర్యాదు చేశారు. కానీ పోలీసులు పట్టించుకోకపోవడంతో కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల మేరకు చక్రధర్‌గౌడ్‌ను గతంలో విచారించిన పోలీసులు సరైన ఆధారాలు తీసుకు రావాలని సూచించారు. ఈ మేరకు చక్రధర్‌గౌడ్‌ జూబ్లీహిల్స్‌ ఏసీపీని కలిసి ట్యాప్‌ అయినట్టు అనుమానిస్తున్న సెల్‌ఫోన్‌తో పాటు యాపిల్‌ కంపెనీ నుంచి ఫోన్‌ ట్యాప్‌ అయిందని వచ్చిన మెయిల్‌ కాగితాలు, ఇతర వివరాలను విచారణ అధికారులకు అందచేశారు. హరీశ్‌రావుకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాననే కక్షతో తనపై అనేక కేసులు పెట్టి జైలుకు పంపించారని చక్రధర్‌గౌడ్‌ ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో రంగనాయకసాగర్‌ కుంభకోణాన్ని వెలుగులోకి తీసుకువచ్చింది తానేనని ఆయన వెల్లడించారు..

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest