హైదరాబాద్ (తెలంగాణ వాణి)
అక్టోబర్ 8 నేడే పౌరహక్కుల యోధుడు బాలగోపాల్ 15వ వర్ధంతి. భౌతికంగా ఆయన మన మధ్య లేనప్పటికీ ప్రజల కనీస హక్కుల సాధనకై పోరాడిన ప్రొఫెసర్ కే బాలగోపాల్ ఆశయాలు సజీవంగా మన మధ్యనే ఉన్నాయి. రైతు కూలీలు, విద్యార్థులు, కార్మిక సంఘాలు, రాజ్యాంగబద్ధమైన హక్కుల పోరాటాల్లో పాల్గొనడమే ఈ దేశంలో నేరమైంది. ప్రజల పౌర హక్కులు కాలరాయబడిన వేళ తన ఊక్కుపిడికిలి పైకిత్తి రాజ్య హింస సాగదని గుండెలెదురొడ్డి పోరాడిన యోధుడు డా కే బాలగోపాల్. తన జీవిత కాలాన్ని పీడిత ప్రజలను చైతన్యపర్చడానికే వెచ్చించాడు. వేలాది వేదికల మీద ప్రసంగాలు చేసి పౌరులను ప్రజలను మేల్కొల్పాడు. తెలంగాణ గ్రామాల్లో భూస్వాముల వెట్టి చాకిరికి వ్యతిరేకంగా రైతు కూలీలు ఉద్యమించారు. వారిపై పాశవికమైన రాజ్య హింసను ప్రభుత్వాలు అమలు చేశాయి. పోలీసుల బూటకపు ఎన్కౌంటర్లతొ పల్లెలన్నీ రక్తసిక్తమయ్యాయి. తెలంగాణ ప్రజలకు బాలగోపాల్ అండగా నిలిచాడు. చట్టబద్ధమైన అనేక హక్కుల పోరాటాలు చేశాడు. రాజ్యాంగబద్ధమైన మానవ హక్కుల కమిషన్ ను ప్రజల వద్దకు నడిపించాడు. న్యాయవ్యవస్థల తలుపు తట్టి న్యాయాన్ని డిమాండ్ చేశారు. దేశప్రజలు భిన్నమైన భావాలు వ్యక్తం చేయవచ్చని, వాక్ సభా స్వాతంత్రాలు స్వేచ్ఛ రాజ్యాంగం ప్రతి పౌరునికి కల్పించిందని విస్తృతంగా ప్రజల్లో ప్రచారం చేశాడు. బాలగోపాల్ ప్రసంగాలతో ప్రజలు పౌరులుగా చైతన్యవంతులయ్యారు. ప్రజాస్వామ్య స్ఫూర్తిని పొందగలిగారు. ప్రజాస్వామ్య వ్యతిరేకులు పోలీస్ మూకలు సృష్టించిన నల్లదండు ఆయనపై భౌతిక దాడులకు పాల్పడింది. కిడ్నాప్ చేసి చిత్రహింసలకు గురి చేసింది. అనేక మంది పౌర హక్కుల నాయకులను హత్య చేశారు. పోరాడే ప్రజలకు అండగా నిలిచిన బాలగోపాలను భౌతికంగా అంతమొందించడానికి రాజ్యం అనేక ప్రయత్నాలు చేసింది. తన ప్రాణాలను సైతం లెక్కచేయక పౌర హక్కులు మానవహక్కుల ఉద్యమాలే ఊపిరిగా మన బాలగోపాల్ జీవించాడు. పేద ప్రజలను ప్రేమించాడు. ఆయన జీవిత యథార్థ గాదంతా ఎంతో కొనియాడ తగింది. పీడిత ప్రజలకు ఆదర్శవంతమైనది.