కొత్తగూడెం (తెలంగాణ వాణి)
చెరువలను, కుంటలను కబ్జా చేసి విలాసవంతమైన భావనాలు నిర్మించిన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి సీనియర్, సిన్సియర్ ఆఫీసర్ గా పేరున్న రంగనాధ్ IPS ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హైడ్రా చేస్తున్న సంస్కరణలకు తెలంగాణ రాష్ట్రంలోనే కాక ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నో ఏళ్లుగా రాజకీయ, ఆర్థిక పరపతితో చెరువులు కుంటలు కబ్జాలు చేస్తూ మా నిర్మాణాలు చేస్తున్న వారిపై ఎన్ని విధాలుగా ఫిర్యాదులు చేసిన వాళ్లకు భయపడి అధికారులు చర్యలు తీసుకునేందుకు ముందుకు రాలేదని, ప్రస్తుతం హైదరాబాద్‌లో హైడ్రా కమిషనర్ ఎ. వి రంగనాథ్, ఐపీఎస్ ఆధ్వర్యంలో జరుగుతున్న పనులు చూసి ‘We want Hydra’, మాకూ కావాలి హైడ్రా లాంటి వ్యవస్థ అంటున్నారు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల ప్రజలు. రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాలలో ఈ హైడ్రా లాంటి వ్యవస్థను ఏర్పాటు చేసి మైనర్ ఇరిగేషన్ చెరువులు, కుంటలు కాపాడాలని, ఇలాంటి మంచి పనులకు సమాజంలో ప్రజలు కూడా ఘన స్వాగతం పలుకుతున్నారు.
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 51A(g) ప్రకారం, చెరువులు, కుంటలు, పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి పౌరుని బాధ్యత. కాకతీయ రాజులు నిర్మించిన గొలుసు కట్టు చెరువులు, కుంటలు క్రమ క్రమంగా బడాబాబుల కబ్జాల వల్ల మాయం అవుతున్నాయనేది వీరి ప్రధాన ఆరోపణ. నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో ఏర్పడ్డ తెలంగాణలో గత ప్రభుత్వం మిషన్ కాకతీయ కార్పొరేషన్ పేరుతో వేలకోట్లు ఖర్చు పెట్టింది. కానీ ఏ ఒక్క చెరువునూ, కుంటనూ సర్వే చేసి ఎఫ్‌టిఎల్, బఫర్ జోన్ హద్దులు నిర్ణయించలేదు. ఫలితం… మిషన్ కాకతీయ కమీషన్లు, కబ్జాల కాకతీయ అయిపోయిందని, కొత్తగూడెం పట్టణం భద్రాద్రి జిల్లా కేంద్రం అయిన తర్వాత కబ్జాలకు అంతులేకుండా పోయిందని, వీటిని అరికట్టాల్సిన అధికారులు అక్రమ కట్టడాలకు అనుమతులు ఇవ్వడమే కాక ఇంటి నంబర్స్ కూడ కేటాయించడం దారుణమన్నారు.
భద్రాద్రి జిల్లాలో కూడా ఈ హైడ్రా లాంటి వ్యవస్థను ఏర్పాటు చేసి మైనర్ ఇరిగేషన్ చెరువులు, కుంటలు కాపాడాలి. కబ్జాలు అక్రమ కట్టడాలు కేవలం హైదరాబాద్‌లో మాత్రమే కాదు ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్నాయని ప్రభుత్వం గుర్తించాలని కబ్జా చేసిన వారు ఎంతటి వారైనా సరే, ఏ రాజకీయ పార్టీ నాయకుడు అయినా సరే ఎలాంటి తారతమ్యం లేకుండా పర్యావరణ పరి రక్షణ ప్రాథమిక బాధ్యత అని గుర్తించి ప్రభుత్వం ముందుకు వెళ్లాలని పలువురు కోరుకుంటున్నారు.