UPDATES  

 విచారణకు పిలిచి రాఖీ కట్టిన మహిళా కమిషన్ సభ్యులు

హైదరాబాద్ (తెలంగాణ వాణి కరస్పాండెంట్)

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఇవాళ మహిళా కమిషన్ ముందు హాజరయ్యారు. మహిళలపై చేసిన వ్యాఖ్యలకు ఆయన మహిళా కమిషన్ ఎదుట హాజరై వివరణ ఇచ్చారు. ఇవాళ ఉదయం 11 గంటలకు కేటీఆర్‌.. మహిళా కమిషన్‌ కార్యాలయానికి వచ్చారు. దీనికి ముందు మహిళా కమిషన్ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున హైడ్రామా నడిచింది. ఇది మహిళా కమిషన్‌ కార్యాలయం ఎదుట తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ మహిళా కార్యకర్తలు పోటాపోటీగా నిరసనలు, నినాదాలకు దిగారు. కేటీఆర్‌ బహిరంగ క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేయగా.. సీఎం రేవంత్‌రెడ్డి క్షమాపణలు చెప్పాలని బీఆర్‌ఎస్‌ డిమాండ్‌ చేసింది. ఇరువర్గాల మధ్య వాగ్వాదం, పరస్పరం తోపులాట జరగడంతో పోలీసులు వచ్చి అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే పోలీసులు కాంగ్రెస్ మహిళా నేతలను అరెస్ట్ చేశారు.

మొత్తానికి కేటీఆర్‌ మహిళా కమిషన్ ఎదుట హాజరయ్యారు. వివరణ ఇచ్చేందుకని ఆయన వస్తే.. మహిళా కమిషన్ సభ్యులు పోటీలు పడి మరీ రాఖీలు కట్టడం ఒకింత ఆశ్చర్యంగా అనిపించింది. విచారణకు పిలిచి కేటీఆర్‌కు రాఖీ కట్టి సోదర అనుబంధాన్ని మహిళా కమిషన్ సభ్యులు చాటుకున్నారు. అనంతరం ఉచిత బస్సు ప్రయాణ విషయంలో మహిళలపై తాను చేసిన కామెంట్స్ యథాలాపంగా చేసినవేనని కేటీఆర్ వివరణ ఇచ్చారు. మహిళలంటే తనకు ఎంతో గౌరవం ఉందని చెప్పారు. రాష్ట్రంలో మహిళలపై ఇటీవల జరిగిన దాడులపై చర్యలు తీసుకోవాలని కేటీఆర్ కోరారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest