అనకాపల్లి:జిల్లా ఎస్ రాయవరం మండలం పెద ఉప్పలం గ్రామ సమీపంలో వరహ నదిలో శక్తి రూపం బయటపడింది. పనికి ఉపాధి హామీ పథకం పనులు చేసుకుని ఇంటికి తిరిగి వస్తున్న గ్రామస్తులకు వరాహనదిలో అమ్మవారు విగ్రహం దర్శనమిచ్చింది. అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం వాకపాడు గ్రామస్తులు ప్రతిరోజు ఉదయాన్నే పనికి ఆహార పథకంలో భాగంగా పనులు చేసుకుని తిరిగివస్తు వరాహనది లోనించి నడుచుకి వస్తుండగా సగం ఇసుకలో కూరుకుపోయిన రాతి విగ్రహం కంటపడింది. గ్రామస్తులు దగ్గరికి వెళ్లి విగ్రహాన్ని అతి కష్టం మీద పైకి లేపి నీటితో శుభ్రం చేశారు. అమ్మవారు శక్తి రూపంలో ఒక చేత ఖడ్గం మరోచేత డమరుకం మరో చేతిలో త్రిశూలం మరో చేత కుంకుమ భరణి ధరించి ఉంది. శక్తి రూపంలో ఉన్న అమ్మవారు ఆసనంలో కూర్చుని అసుర సంహారం చేస్తూ దర్శనమిచ్చింది. అమ్మవారి శక్తి రూపం బయటపడటంతో చుట్టుపక్కల గ్రామాల వారు తండోపతండాలుగా వచ్చి అమ్మవారికి పూజలు నిర్వహించారు. గ్రామంలో ఇప్పటివరకు అమ్మవారి గుడి లేదని అమ్మవారి విగ్రహాన్ని గ్రామంలోకి తరలించి నిత్య పూజలు నిర్వహిస్తామని అన్నారు. గత నాలుగు సంవత్సరాలుగా వరాహనది పూర్తిగా ఎండిపోలేదని ఈ సంవత్సరం ఎండల తాకిడికి నది ఎండిపోయిందని దీంతో అమ్మవారి విగ్రహం బయటపడిందని గ్రామస్తులు తెలిపారు. గ్రామంలో పూర్వం బ్రాహ్మణులు నివాసం ఉంటూ అమ్మవారిని ఆరాధించే వారిని అప్పటి కాలం నాటి విగ్రహం అయ్యుండొచ్చు అని అభిప్రాయాన్ని గ్రామస్తులు వెల్లడించారు.