
డిఫాల్ట్ మిల్లర్లపై రెవెన్యూ రికవరీ యాక్టు అమలు చెయ్యండి
కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి
నిజామాబాద్, సెప్టెంబర్ 12 : (తెలంగాణ వాణి ప్రతినిధి)
సీ.ఎం.ఆర్(కస్టమ్ మిల్లింగ్ రైస్) అందించడంలో విఫలమైన డిఫాల్ట్ రైస్ మిల్లర్లపై నిబంధనల మేరకు రెవెన్యూ రికవరీ యాక్టును అమలుపర్చాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి తహసీల్దార్ లను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నుండి కలెక్టర్ తహసీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. డిఫాల్ట్ మిల్లర్లపై ఇప్పటివరకు చేపట్టిన చర్యలు, వారి నుండి రావాల్సిన మొత్తం ఎంత, ఇప్పటి వరకు ఎంత రికవరీ చేశారు తదితర వివరాలను ఒక్కో డిఫాల్ట్ రైస్ మిల్ వారీగా సంబంధిత మండల తహసీల్దార్ ను అడిగి తెలుసుకున్నారు. డిఫాల్ట్ రైస్ మిల్లులతో పాటు, మిల్లర్లకు చెందిన ఆస్తులను బ్లాక్ చేయించాలని, అవసరమైతే ఆస్తులను వేలం వేసి సీఎంఆర్ నిధులను రాబట్టే దిశగా చర్యకు తీసుకోవాలని కలెక్టర్ కరాఖండిగా తేల్చి చెప్పారు. సీ.ఎం.ఆర్ నిధులు పూర్తి స్థాయిలో రికవరీ కావాల్సిందేనని, నిబంధనల ప్రకారం కఠిన చర్యలతో ముందుకు వెళ్లాలని సూచించారు. ఇకనుండి తాను సీఎంఆర్ రికవరీపై ప్రతీ వారం సమీక్ష జరుపుతానని, ఎప్పటికప్పుడు ప్రగతి కనిపించాలని అన్నారు. ఈ సందర్భంగా భూభారతి పెండింగ్ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ తహసీల్దార్లను ఆదేశించారు. జాతీయ కుటుంబ ప్రయోజన పథకానికి అర్హులైన వారు దరఖాస్తు చేసుకునేలా చూడాలన్నారు. కొత్త రేషన్ కార్డుల కోసం, సభ్యుల పేర్లను చేర్చాలని కోరుతూ వచ్చే దరఖాస్తులను వెంటనే పరిశీలిస్తూ, అర్హులైన వారికి ఆమోదం తెలుపాలని అన్నారు. ప్రతి దరఖాస్తును క్షేత్రస్థాయిలో పక్కాగా విచారణ చేయాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, డీఎస్ఓ అరవింద్ రెడ్డి, సివిల్ సప్లైస్ డీఎం శ్రీకాంత్ రెడ్డి, కలెక్టరేట్ డీ-సెక్షన్ సూపరింటెండెంట్ శ్రీనివాస్, అన్ని మండలాల తహసీల్దార్లు పాల్గొన్నారు.