జిల్లాలోని బీసీ, ఎస్సీ, మైనారిటీ ఆశ్రమ పాఠశాలలు, గురుకులాలు,ఏకలవ్య పాఠశాలల్లో విద్యార్థులకు అందిస్తున్న ఆహారం నాణ్యతపై ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. గురువారం ఐడీఓసి కార్యాలయంలో సంబంధిత జిల్లా అధికారులు, ఆహార భద్రత అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఇకపై కలుషిత ఆహార ఘటనలు పునరావృతం కాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. విద్యార్థులకు అందిస్తున్న ఆహారం పరిశుభ్రంగా, నాణ్యంగా ఉండేలా ప్రత్యేక కార్యాచరణతో నిరంతర పర్యవేక్షణ నిర్వహించాలని తెలిపారు. ఆహారం కలుషితం కావడానికి గల కారణాలను ఆహార భద్రత అధికారిని అడిగి వివరాలు తెలుసుకున్నారు.పాఠశాలలు, వసతి గృహాల సమీప ప్రాంతాల్లో ఉన్న చిరు తిండ్ల దుకాణాలు, ఐస్క్రీమ్ బండ్లు మరియు ఇతర ఆహార విక్రయ కేంద్రాలపై ఆహార భద్రత అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. విక్రయించే ఆహార పదార్థాల గడువు తేదీలు, నాణ్యత, నిల్వ విధానాలను క్రమం తప్పకుండా పరిశీలించాలని సూచించారు. నాణ్యత లేని లేదా గడువు ముగిసిన ఆహార పదార్థాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.పాఠశాలలకు బయట నుండి ఆహార పదార్థాలు తీసుకురావడం అనుమతించరాదని తెలిపారు. విద్యార్థుల ఆరోగ్యం దృష్ట్యా పాఠశాలల వంటగదులు,భోజన శాలలు పరిశుభ్రంగా ఉండేలా సంబంధిత అధికారులు తరచూ తనిఖీలు నిర్వహించాలని సూచించారు.విద్యార్థుల ఆరోగ్య భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం సహించబోమని కలెక్టర్ హెచ్చరించారు.ఈ సమావేశంలో సీపీఓ సంజీవరావు, బీసీ సంక్షేమ అధికారి విజయలక్ష్మి, ఎస్సీ సంక్షేమ అధికారి శ్రీలత, ఆహార భద్రత అధికారి శరత్, ఆర్సీఓలు మరియు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.