
దశ వసంతంలోకి అడుగుపెట్టిన కళాశాల – ఘనంగా డీకేడిఎల్ టెక్నో ఫెస్ట్ వేడుకలు
సిద్దిపేట/హుస్నాబాద్,ఏప్రిల్ 09 (తెలంగాణ వాణి స్టేట్ కోఆర్డినేటర్)
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రగతి పథంలో మరో మైలురాయిని అధిగమించింది. సివిల్ మరియు ఈఈఈ విభాగాలు విజయవంతంగా తొమ్మిది సంవత్సరాల ప్రయాణాన్ని పూర్తి చేసుకుని పదవ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న శుభసందర్భాన్ని పురస్కరించుకుని కళాశాల ప్రాంగణంలో ‘డీకేడిఎల్’ సెలబ్రేషన్స్ అట్టహాసంగా జరిగాయి. ‘టెక్నిర్వాహణ’ మరియు ‘గ్రిడ్ స్టోము’ వంటి వినూత్న శీర్షికలతో నిర్వహించిన ఈ సాంకేతిక సంబరాలు విద్యార్థుల్లోని సృజనాత్మకతకు అద్దం పట్టాయి.
కళాశాల ప్రిన్సిపాల్ శ్రీమతి పంచదార శ్రీదేవి కన్వీనర్‌గా వ్యవహరించిన ఈ వేడుకలకు సిద్దిపేట ప్రభుత్వ పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్ గోవర్ధన్, ప్రముఖ విద్యావేత్త మధుసూదన్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించిన అతిథులు విద్యార్థులను ఉద్దేశించి స్ఫూర్తిదాయక ప్రసంగం చేశారు. సాంకేతిక రంగం రోజురోజుకూ కొత్త పుంతలు తొక్కుతోందని, విద్యార్థులు కేవలం పుస్తక జ్ఞానానికే పరిమితం కాకుండా, ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పులను గమనిస్తూ సరికొత్త సాంకేతిక అవకాశాలను అందిపుచ్చుకోవాలని వారు పిలుపునిచ్చారు.గత తొమ్మిదేళ్లుగా ఈ కళాశాల ఎంతోమంది గ్రామీణ ప్రాంత విద్యార్థులను ఉన్నత విద్యావంతులుగా మరియు నైపుణ్యం కలిగిన ఉద్యోగులుగా తీర్చిదిద్ది, వారి జీవితాలకు బాటలు వేయడం హర్షణీయమని అతిథులు కొనియాడారు.విద్యార్థులు బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదిగి దేశాభివృద్ధిలో కీలక భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. ఈ సంబరాల్లో భాగంగా నిర్వహించిన వివిధ సాంకేతిక ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి.
ఈ భారీ కార్యక్రమానికి కోఆర్డినేటర్‌గా టి. శ్రీను బాధ్యతలు నిర్వహించగా, డిపార్ట్మెంట్ హెచ్ఓడీలు ఏ. ఇందు, బి. గీతారాణి, ఓఎస్ వెంకటేశం పర్యవేక్షించారు. కార్యక్రమంలో ఉపన్యాసకులు మహ్మద్ వహీద్, నర్రా అర్జునయ్య, మహేష్ కుమార్, రాధిక, జక్కోజు రవికిరణ్, చీకటి సతీష్,రాజు,ప్రవీణ్ తదితరులు విద్యార్థులకు దిశా నిర్దేశం చేశారు. అలాగే నాన్ టీచింగ్ స్టాఫ్ మామునూరి రమాదేవి,బేతి రమాదేవి, బానోతు రాజేందర్, మిట్టపల్లి రమణ మరియు ఆఫీస్ సబార్డినెట్స్ అజ్మీరా విజయ, వున్న వంశీ,గుడెల్లి సుమన్, సాయి, విష్ణు,నరేష్,తిరుపతి, భాస్కర్ తదితరులు పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.


