ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల సంక్షేమం కోసం ఆరోగ్య పత్రం అమలు, వేతన సవరణ ప్రకటనతో పాటు పలు పెండింగ్ సమస్యలను జూన్ 2 నాటికి పరిష్కరించాలని గిరిజన ఉద్యోగుల సంఘం తెలంగాణ రాష్ట్ర కమిటీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది.ఈ మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మూకర రాంబాబు, కార్యనిర్వాహక అధ్యక్షుడు యంపీ నాయక్ మాలోత్ ప్రతాప్ సింగ్ సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఆరోగ్య పత్రం సౌకర్యాన్ని పూర్తి స్థాయిలో అమలు చేసి, ఉచిత వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు.అలాగే పెండింగ్‌లో ఉన్న వేతన సవరణ అంశంపై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకుని అమలు చేయాలని కోరారు. పెరుగుతున్న ధరల నేపథ్యంలో ఉద్యోగులకు న్యాయమైన వేతనాలు అవసరమని పేర్కొన్నారు.గిరిజన అభివృద్ధి సంస్థ పరిధిలో పనిచేస్తున్న భాషా పండితులు, వ్యాయామ ఉపాధ్యాయులను పదోన్నతి కల్పించాలని,ఒప్పంద ప్రాతిపదికన పనిచేస్తున్న వసతి గృహ ఉపాధ్యాయులకు కనీస వేతన శ్రేణి వర్తింపజేసి ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. అదేవిధంగా గ్రామీణ ఆరోగ్య కార్యకర్తలు,దినసరి కూలీలకు ప్రతి నెలా సమయానికి జీతాలు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థుల భద్రత కోసం ప్రహారీ గోడల ఎత్తు పెంచి, సౌర విద్యుత్ తీగలు ఏర్పాటు చేయాలని సూచించారు. పాఠశాల గేట్ల వద్ద ప్రత్యేక కాపలాదారుల గదులు నిర్మించి, శాశ్వత కాపలాదారుల నియామకం చేపట్టాలని కోరారు. దూర ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుల కోసం వసతి గృహాలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.ప్రభుత్వ, ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న సిబ్బందికి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించి, ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని సంఘ నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని అన్ని శాఖల ఉద్యోగులు, ఉపాధ్యాయులు, సిబ్బంది సంక్షేమంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.

