సింగరేణి సీఎండీ డాక్టర్ బుద్దప్రకాశ్ జ్యోతితో మోనాష్ యూనివర్సిటీ బృందం భేటీ
కొత్తగూడెం సింగరేణి, ఆగస్టు 31 (తెలంగాణ వాణి) కీలక ఖనిజాలు పుష్కలంగా ఉన్న ఆస్ట్రేలియా దేశంలో కలిసి పనిచేయడానికి ముందుకురావాలని ఆ దేశ ప్రముఖ పరిశోధన సంస్థ మోనాష్ యూనివర్సిటీ సింగరేణికి ఆహ్వానం పలికింది. మోనాష్ యూనివర్సిటీ ప్రతినిధి బృందం సోమవారం సంస్థ సీఎండీ డాక్టర్ బుద్ద ప్రకాశ్ జ్యోతి తో సమావేశమై ఆస్ట్రేలియా దేశంలో క్రిటికల్ మినరల్స్ రంగంలో గల అవకాశాలను వివరించింది. తమ దేశం అంతర్జాతీయ సంస్థల భాగస్వామ్యాన్ని క్రిటికల్ మినరల్స్ రంగంలో కోరుకుంటోందని, మైనింగ్ రంగంలో విశేష అనుభవం కలిగిన సింగరేణి సంస్థను కూడా పరస్పర లాభదాయ భాగస్వామ్యం కోసం ఆహ్వానిస్తున్నట్లు వివరించారు.ప్రపంచవ్యాప్తంగా నేడు క్రిటికల్ మినరల్స్‌కు డిమాండ్ ఉందని, ఈ రంగంలో తాము ఆధునిక సాంకేతిక, పర్యావరణ హిత మైనింగ్, లాభదాయక వ్యూహాత్మక వ్యాపార చర్యలపై తగిన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడానికి సంసిద్ధంగా ఉన్నామని వివరించారు. పరిశోధన, విద్య, పరిశ్రమలతో భాగస్వామ్యం, పరిశోధన ఫలితాలను వాణిజ్యపరమైన సాంకేతిక పరిష్కారాలుగా మార్చడంలో మోనాష్ యూనివర్సిటీకి ఉన్న అనుభవాన్ని ఆ బృందం వివరించింది. అంతర్జాతీయ స్థాయిలో పరిశ్రమలు, పరిశోధనా సంస్థలతో కలిసి వివిధ రంగాల్లో పనిచేస్తున్నట్లు తెలిపింది.
ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం క్రిటికల్ మినరల్స్‌కు పెరుగుతున్న ప్రాధాన్యం, వాటి అన్వేషణ, వెలికితీత, ప్రాసెసింగ్, రిఫైనింగ్‌తో పాటు విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీకి ఉన్న అవకాశాలపై సమావేశంలో ప్రధానంగా చర్చించారు. ముడి ఖనిజాలకే పరిమితం కాకుండా డౌన్‌స్ట్రీమ్ ప్రాసెసింగ్, రిఫైనింగ్ ద్వారా అదనపు విలువను సృష్టించే అవకాశాలను మోనాష్ బృందం వివరించింది.
మైనింగ్ రంగంలో సుస్థిరత, పర్యావరణ హిత విధానాలు, మైన్ క్లోజర్ ప్లానింగ్, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, నైపుణ్యం కలిగిన మానవ వనరుల అభివృద్ధి వంటి అంశాల్లో తమ సేవలను వినియోగించుకోవాలన్నారు.
ఈ సందర్భంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కీలక ఖనిజ రంగంలోకి ప్రవేశంచడానికి చేస్తున్న కృషిని సింగరేణి అధికారులు మోనాష్ యూనివర్సిటీ ప్రతినిధులకు వివరించారు. ఇటీవలే కర్ణాటకలో బంగారం,రాగి గనుల అన్వేషణను ప్రారంభించామని వివరించారు.
క్రిటికల్ మినర్సల్ రంగంలో పరస్పర లాభదాయకమైన భాగస్వామ్యం కోసం అంతర్జాతీయంగా ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నామని సింగరేణి సీఎండీ డాక్టర్ బుద్దప్రకాష్ జ్యోతి తెలిపారు. మోనాష్ యూనివర్సిటీ-సింగరేణి మధ్య పరిశోధన, ఆధునిక సాంకేతికత, క్రిటికల్ మినరల్స్, నైపుణ్యాభివృద్ధి తదితర అంశాల్లో భవిష్యత్ సహకార అవకాశాలను పరిశీలిస్తామన్నారు. త్వరలో సింగరేణి ఉన్నతస్థాయి అధికార బృందాన్ని ఆస్ట్రేలియాలో అవకాశాల పరిశీలనకు పంపిస్తామన్నారు.
సమావేశంలో డైరెక్టర్(పర్సనల్ , ఫైనాన్స్) గౌతమ్ పోట్రు, జీఎం(కో ఆర్డినేషన్, మార్కెటింగ్) టి. శ్రీనివాస్, కొత్తగూడెం కార్పోరేట్ ఆఫీస్ నుంచి డైరెక్టర్ (ఆపరేషన్స్) ఎల్వీ సూర్యనారాయణ, డైరెక్టర్(పిపి) కె.వెంకటేశ్వర్లు, జీఎం(బీడీ) రాందాస్, జీఎం (ఎక్స్ ప్లోరేషన్) పంకజ్ కులశ్రేష్ట, మోనాష్ యూనివర్సిటీ ప్రొఫెసర్ యానిస్ వెంటికోస్ తదితరులు పాల్గొన్నారు.



