అమెరికా మహిళల జాతీయ క్రికెట్ జట్టులో హైదరాబాద్ కు చెందిన ఇమ్మడి సాన్వికి స్థానం లభించింది. యూఏఈలో జరగనున్న ప్రపంచ కప్ క్వాలిఫయర్స్ లో ఆమె అమెరికా జట్టుకు ప్రాతినిధ్యం వహించనుంది.
కాగా.. 2020లో యూత్ క్రికెట్ అసోసియేషన్ కాలిఫోర్నియా తరఫున సాన్వి అరంగేట్రం చేసింది. సాన్వి రైట్ ఆర్మ్ లెగ్ స్పిన్ ఆల్ రౌండర్. క్రికెట్ ఆడటం మొదలుపెట్టిన నాలుగేళ్లలోనే ఆమె జాతీయ జట్టుకు ఆడబోతోంది.
ఇమ్మడి సాన్వి కుటుంబం సికింద్రాబాద్ లోని సీతాఫల్ మండికి చెందినది. అయితే 1997లో అమెరికాకు వెళ్లిపోయిన సాన్వి ఫ్యామిలీ.. కాలిఫోర్నియా రాష్ట్రంలో సెటిలైంది. కాగా.. ఆమె తండ్రి రమేష్ ప్రస్తుతం సిస్కో సిస్టమ్స్ లో కన్సల్టెంట్ గా పని చేస్తున్నారు. సాన్వీ కూడా హైదరాబాద్ కే చెందిన ఐసీసీ లెవల్ 3 కోచ్ జగదీశ్ రెడ్డి కోచింగ్ లో శిక్షణ తీసుకుంది.
2020లో సాన్వీ ప్రొఫెషనల్ క్రికెట్ ఆడటం ప్రారంభించింది. కాలిఫోర్నియాలోని సాన్ రామన్ యూత్ క్రికెట్ అసోసియేషన్ టీమ్ తరఫున ఆడింది. ఆ తర్వాత ఎంఎల్‌సీ జూనియల్ లీగ్ లో కాలిఫోర్నియా అండర్ 15 జట్టుకు కెప్టెన్ గానూ వ్యవహరించింది. ఇదిలా ఉంటే.. సాన్వి సాన్ డీగో టీ20 టోర్నీలో 10 వికెట్లు సాధించింది. ఆ తర్వాత యూఎస్ నేషనల్ సెలక్షన్స్ టోర్నీలో 9 వికెట్లు తీసుకొని నేషనల్ టీమ్ కు సెలక్ట్ అయింది. కాగా.. సాన్వీ ఇప్పటి వరకూ మొత్తం 145 మ్యాచ్ లు ఆడి 819 పరుగులు చేసింది. అంతేకాకుండా 77 వికెట్లు తీసుకుంది.