దామోదర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన సీఎం రేవంత్ రెడ్డి
తుంగతుర్తి, అక్టోబర్ 12,(తెలంగాణ వాణి ప్రతినిధి) శ్రీరామ్ సాగర్ రెండో దశకు మాజీ మంత్రి స్వర్గీయ రాంరెడ్డి దామోదర్ రెడ్డి పేరు పెడుతున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఆదివారం తుంగతుర్తి మండల కేంద్రంలో నిర్వహించిన మాజీ మంత్రి స్వర్గీయ రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి సంతాప సభకు హాజరై మాట్లాడుతూ తుంగతుర్తి సూర్యాపేట ప్రాంతాలకు దామోదర్ రెడ్డి చేసిన సేవలు ఎప్పటికీ మరువలేనివని అన్నారు. కాంగ్రెస్ పార్టీని కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ దాదాపు నాలుగు దశాబ్దాలపాటు కాంగ్రెస్ జెండాను ఈ ప్రాంతంలో ఎగరవేసిన గొప్ప నాయకుడు దామోదర్ రెడ్డి అని సీఎం అన్నారు. రాజకీయాల్లో ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు ఆస్తులను సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారని కానీ రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి మాత్రం వారసత్వంగా వచ్చిన ఆస్తులను పేదలకు పంచడమే కాకుండా, తన అత్త కుటుంబ ఆస్తులను కూడా వేలాది ఎకరాలను తుంగతుర్తి ప్రాంత ప్రజలకు దానం చేశారని సీఎం ఈ సందర్భంగా తెలిపారు. రామ్ రెడ్డి దామోదర్ రెడ్డికి, ఏఐసీసీ అగ్ర నేతలు సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, సంతాపం తెలియజేయాల్సిందిగా తెలిపారని, వారి తరపున సర్వోత్తమ్ రెడ్డికి దామోదర్ రెడ్డి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని తెలియజేస్తున్నానన్నారు. దామోదర్ రెడ్డి కుటుంబానికి ఏఐసీసీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని, రానున్న రోజుల్లో రాజకీయంగా అండగా ఉంటుందని తెలిపారు. నీళ్ల కరువు ప్రాంతమైన తుంగతుర్తికి శ్రీరామ్ సాగర్ జలాలను ఈ ప్రాంతానికి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించి కరువు ప్రాంతమైన, ఫ్లోరైడ్ ప్రాంతమైన తుంగతుర్తికి నాటి సీఎం రాజశేఖర్ రెడ్డిని ఒప్పించి, మెప్పించి జలాలు తీసుకువచ్చిన రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి పేరును ఎస్సారెస్పీ పేస్ – 2 కు పెడుతున్నట్లు ప్రజల హర్షద్వనాల మధ్య ప్రకటించారు.