UPDATES  

NEWS

 పసుపుకు మద్దతు ధర ప్రకటించకపోతే జిల్లా కలెక్టరేట్ ను ముట్టడిస్తాం

మార్కెట్ యార్డ్ ని సందర్శించిన బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత

నిజామాబాద్ (తెలంగాణ వాణి)

ఈనెల ఆఖరి వరకు పసుపు రైతులకు మద్దతు ధర 12 వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించకపోతే జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట పసుపు రైతులతో పెద్ద ఎత్తున ధర్నా చేపడతామని ఎమ్మెల్సీ కవిత అన్నారు.. ఈ మేరకు శనివారం పసుపు రైతులతో కలిసి నిజామాబాద్ మార్కెట్ యార్డ్ ని సందర్శించారు. పసుపు రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ పార్లమెంట్లో పసుపు బోర్డు బిల్లు పెట్టి పాస్ చేసినట్లయితే బయట దేశాల నుండి వచ్చే నాసిరకం పసుపు దిగుమతిని తగ్గించుకోవచ్చు అన్నారు. దానివల్ల ఇక్కడి రైతులకు ధర పెరిగే అవకాశం ఉంటుందన్నారు. అదేవిధంగా ఇక్కడ పసుపు పరిశ్రమలు పెట్టవచ్చని దానివల్ల పసుపుకు రేటు వచ్చే ఆస్కారం ఉంటుందన్నారు. ఏదైనా ఒక సీజన్లో పంట కోల్పోయిన రైతులకు మద్దతుగా ఉండేందుకు 15000 మద్దతు ధర ఇస్తే ఆ భయంతోనైనా వ్యాపారులు వీరిని కరెక్టుగా చూసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. ఈరోజు మార్కెట్లో ఇవేమీ లేనందు వల్ల వ్యాపారులు అంత సిండికేట్ అయ్యారని మొత్తానికి మొత్తం ధర తగ్గిచేస్తున్నారని, ఇక్కడికి వచ్చిన రైతు మూడు నాలుగు రోజులు వేచి ఉన్నప్పటికీ కూడా ఈ పసుపు వెరైటీ ఏంటి బిల్లు ఏంటి అనే దానిపై స్పష్టత లేని పరిస్థితి ఏర్పడిందని మండిపడ్డారు. తప్పని సరి పరిస్థితుల్లో రైతు తను తెచ్చిన పసుపును తిరిగి తీసుకు వెళ్ళలేని పరిస్థితులు తక్కువ రేట్ కి అమ్ముకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈ పద్ధతి రైతులను బ్లాక్మెయిల్ చేసే విధంగా ఉందన్నారు. ఏ వెరైటీ పసుపైన ఎంత మంచి పసుపైన దాని ధరను తగ్గించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్లనే ఇలాంటి పరిస్థితి నెలకొంది అన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ పసుపు రైతులకు 12000 రూపాయలు ఇస్తామని పసుపు ఎంత తక్కువకు అమ్ముడు పోయిన మిగతా బోనస్ రైతుకు అందజేస్తామని అన్నారు ఈరోజు మార్కెట్ యాడ్లో చూస్తే రైతులకు 8000, 9000 వరకు పసుపు అమ్ముడుపోయిందని మిగతా బోనస్ డబ్బులను రైతులకు ప్రభుత్వం అందజేయాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డినీ విజ్ఞప్తి చేశారు. దీనస్థితిలో ఉన్న పసుపు రైతులకు బోనస్ డబ్బులు అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావాలని డిమాండ్ చేశారు. ఇక్కడ వ్యాపారులందరూ సిండికేట్ అయి రైతులను అన్యాయం చేస్తున్నారని ప్రభుత్వం దిగివచ్చి పసుపు రైతులకు మద్దతు ధర ప్రకటించకపోతే నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ ని ముట్టడిస్తామని దీనికి రైతులందరూ సన్నద్ధం కావాలని ఆమె పిలుపునిచ్చారు. ఏ విధంగా అయితే తల్లి తన బిడ్డను తొమ్మిది నెలలు కడుపులో మోస్తుందో అదే విధంగా రైతులు ఎంతో కష్టపడి తొమ్మిది నెలలు పసుపును మోస్తాడని.. ప్రభుత్వానికి కొంచమైనా పసుపు రైతుల పట్ల కనికరం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పసుపు రైతులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని అన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest