UPDATES  

 గన్నవరంలో TDP గెలిచే సంప్రదాయం కొనసాగేనా? జనం జగన్‌కు జై కొడతారా?

: కృష్ణాజిల్లాలోని మచిలీపట్నం(Machilipatnam) లోక్సభ పరిధిలో ఉన్న గన్నవరం(Gannavaram) అసెంబ్లీ నియోజకవర్గం ఒకప్పుడు వామపక్షాలకు కంచుకోట.

సీపీఎం వ్యవస్థాపకుల్లో ఒకరైన కామ్రెడ్ పుచ్చలపల్లి సుందరయ్య ఇక్కడ నుంచి మూడుసార్లు విజయం సాధించి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆ తర్వాత కాంగ్రెస్ కొంత ప్రాభల్యం చూపినా…ప్రస్తుతం ఈ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి అడ్డగా మారింది. ఆ పార్టీ నుంచి గెలుపొందిన వల్లభనేని వంశీ(Vallabaneni Vamsi) ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉండగా…ఆయన వైసీపీలో చేరారు..

కామ్రెడ్ల కంచుకోట
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫలితం ఏదైనా ఉందంటే అది కృష్ణాజిల్లాలోని గన్నవరం(Gannavaram) నియోజకవర్గమే. అక్కడ పోటీపడుతున్న అభ్యర్థుల వల్లే ఈ రిజల్ట్పై తీవ్ర ఉత్కంఠ రేగుతోంది. అయితే నియోజకవర్గం ఏర్పాటైన దగ్గర నుంచీ ఇక్కడ ఫలితాలు సంచలనమే. 1955లో గన్నవరం నియోజకవర్గం ఏర్పడగా….కమ్యునిస్టు పార్టీ సీనియర్ నేత, సీపీఏం వ్యవస్థాపకుల్లో ఒకరైన కామ్రెడ్ పుచ్చలపల్లి సుందరయ్య సీపీఐ(CPI) తరఫున పోటీ చేసి విజయం సాధించారు. ఆతర్వత జరిగిన1962ఎన్నికల్లోనూ ఆయన రెండోసారి గెలుపొంది అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆ తర్వాత వరుసగా మూడుసార్లు గెలిచి కాంగ్రెస్(Congress) హ్యాట్రిక్ కొట్టింది. 1967లో సీతారామయ్య, 1968లో జరిగిన ఉప ఎన్నికల్లో కె.వెంకటరత్నం, విజయం సాధించారు. 1972లో జరిగిన ఎన్నికల్లో ఆనంబాబు విజయం సాధించారు.1978లో జరిగిన ఎన్నికల్లో సీపీఎం తరఫున పుచ్చలపల్లి సుందరయ్య పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి లంకా వెంకటేశ్వరరావు(Lanka Venkateswararo) భారీ మెజార్టీతో విజయం సాధించారు.

1983 లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్(Congress) అభ్యర్థి కొమ్మినేని శేషగిరిరావుపై స్వల్ప ఓట్ల తేడాతో తెలుగుదేశం అభ్యర్థి ముసునూరు రత్నబోస్ గెలుపొందారు. ఆ తర్వాత 1985లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి ములుపూరు బాలకృష్ణారావు…కాంగ్రెస్ అభ్యర్థి కొలుసు పెద్ద బీదయ్యపై విజయం సాధించారు. తెలుగుదేశం నుంచి కాంగ్రెస్ చేరిన ముసునూరు రత్నబోస్(Rathna Bosu)…1989లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి తెలుగుదేశం సిట్టింగ్ ఎమ్మెల్యే బాలకృష్ణారావుపై స్వల్ప ఓట్ల తేడాతో మరోసారి విజయం సాధించారు. 1994లో జరిగిన ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం గాలి వీచినా…గన్నవరంలో మాత్రం ఇండిపెండెంట్ అభ్యర్థి గద్దె రామ్మోహన్ తెలుగుదేశం అభ్యర్థి దాసరి బాలవర్థనరావుపై సంచలన విజయం సాధించారు. అనంతరం ఆయన తెలుగుదేశంలో చేరారు.

1999లో జరిగిన ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్(Gadde Rammohan) విజయవాడ ఎంపీగా పోటీ చేయగా….తెలుగుదేశం నుంచి దాసరి బాలవర్థనరావు, కాంగ్రెస్ నుంచి ముద్రబోయిన వెంకటేశ్వరావు పోటీపడ్డారు. విజయం ఈసారి దాసరిని వరించింది. 2004లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం సిట్టింగ్ ఎమ్మెల్యే దాసరి బాలవర్థనరావుపై ఇండిపెండెంట్ అభ్యర్థిగా ముద్రబోయిన వెంకటేశ్వరరావు పోటీ చేసి గెలుపొందారు. 2009లో జరిగిన ఎన్నికల్లో మరోసారి ముద్రబోయిన, దాసరి పోటీపడ్డారు. కాంగ్రెస్ నుంచి ముద్రబోయిన వెంకటేశ్వరరావు పోటీ చేయగా…తెలుగుదేశం నుంచి దాసరి పోటీచేసి మరోసారి గెలుపొందారు. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ వల్లభనేని వంశీ(Vallabaneni Vamsi)కి టిక్కెట్ ఇచ్చింది. వైసీపీ(YCP) నుంచి పోటీపడిన దుట్టా రామచంద్రరావుపై ఆయన తొమ్మిదిన్నర వేల ఓట్ల తేడాతో విజయం సాధించారు.

గత ఎన్నికల్లో మరోసారి సిట్టింగ్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి తెలుగుదేశం టిక్కెట్ కేటాయించగా….వైసీపీ నుంచి ఎన్నారై యార్లగడ్డ వెంకట్రావు(Yarlagadda Venkatrao) పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో స్వల్ప మెజార్టీ 838 ఓట్ల తేడాతో వల్లభనేని వంశీ గెలుపొందారు. అనంతరం ఆయన వైసీపీలో చేరగా….వంశీపై ఓటమిపాలైన యార్లగడ్డ వెంకట్రావు తెలుగుదేశంలో చేరారు. మరోసారి వీరిరువురి మధ్య పోటీ నువ్వా-నేనా అన్నట్లు సాగుతోంది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest