ధర్మారం (తెలంగాణ వాణి విలేకరి) ఇటీవల గుండెపోటుతో హఠాత్ మరణం చెందిన తెలంగాణ ప్రజా గాయకుడు అందెశ్రీకి ధర్మారం మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం ముందు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి కొవ్వొత్తుల తో ఘన నివాళులు అర్పించారు. అనంతరం తెలంగాణ ప్రదేశం కాంగ్రెస్ సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు బొల్లి స్వామి మాట్లాడుతూ తెలంగాణలో అణగారిన వర్గాల కోసం తన గొంతు నే ఆయుధంగా మార్చుకుని పోరాడిన ప్రజా గాయకుడు అందెశ్రీ అని కొనియాడారు. ఆయన మరణం తెలంగాణ యావత్ బహు జనులకు తీరనిలోటని అందె శ్రీ కేవలం గాయకుడే కాదు సమాజ హితం కోసం పాడిన సామాజిక వర్గాల నొప్పిని పదాల్లో చెక్కి గాత్రంలో పోసి ప్రజల హక్కుల కోసం పాటలను సృష్టించిన అరుదైన కళాకారుడని తెలంగాణ పల్లెల్లో ఉద్యమాల పోరాట ర్యాలీలో ప్రతిధ్వనించిన ఆయన పాటలు వేలాది మందికి మనోధైర్యాన్ని చైతన్యాన్ని నింపాయని అన్నారు. పేదల బాధను అర్థం చేసుకొని సున్నితమైన హృదయం అనిచివేతకు గురైన వర్గాల పక్షాన నిలిచిన అందెశ్రీ సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన సేవలు ఎనలేని వని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండల ప్రధాన కార్యదర్శి దేవి రాజలింగు, ఎమ్మార్పీఎస్ మండల కో కన్వీనర్ నెరువట్ల అభిలాష్ ,సాంస్కృతిక కళామండలి జిల్లా నాయకులు పిట్టల రమేష్, పోలవేణి శ్రీనివాస్, జగిత్యాల జిల్లా టిపిసిసి సింగర్ కండ్లే అంజన్న తదితరులు పాల్గొన్నారు.

