ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ ప్లేయర్ పృథ్వీ షా గురించి తెలియని వారుండరు. క్రీజులో ఉన్నంతసేపు ఫోర్లు, సిక్స్ లతో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడుతాడు.
అలాంటిది.. తాజాగా జరుగుతున్న ఐపీఎల్ సీజన్ లో అతను మ్యాచ్ ల్లో కనపడటం లేదు. కేవలం డగౌట్ కే పరిమితమయ్యాడు. అతని స్థానంలో ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన యువ ఆటగాడు రికీ భుయ్ కు అవకాశం కల్పించారు.
గురువారం రాజస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఓటమితో ఢిల్లీకి ఇది రెండో ఓటమి. అయితే.. జట్టులో పృథ్వీ షాకు స్థానం కల్పించకపోవడంపై ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ టామ్ మూడీ తప్పుబట్టారు.
పృథ్వీ షా మంచి ఆటగాడు.. అతనికి అంతర్జాతీయ స్థాయిలో ఆడిన అనుభవం ఉంది. అలాంటిది.. డగౌట్ లో ఎందుకు కూర్చోబెడుతున్నారో అర్ధం కావడం లేదన్నారు. గత సీజన్ లో రాణించలేకపోయినప్పటికీ.. ఈ సీజన్ లో కూడా రాణించలేడన్న నమ్మకం ఏముందన్నాడు. డగౌట్ లో కూర్చోపెడితే ఏమస్తుంది.. క్రీజులోకి పంపితేనే కదా సత్తా తెలిసేదని మూడీ పేర్కొన్నాడు. పృథ్వీ షా చాలా డేంజరస్ క్రికెటర్.. అతనికి అవకాశాలు ఇవ్వలన్నాడు. కాగా.. ఢిల్లీ క్యాపిటల్స్ తన తర్వాతి మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ తో ఆడనుంది. ఆ మ్యాచ్ లోనైనా పృథ్వీ షాకు అవకాశమిచ్చి తొలి విజయాన్ని నమోదు చేస్తారో లేదో చూడాలి.