UPDATES  

 బాలకృష్ణకు ఆ స్వామిజీ ఎఫెక్ట్.. హిందూపురం నుంచి ఇండిపెండెంట్ గా పోటీ

ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాజకీయాలు రోజు రోజుకు హాట్ హాట్‌గా మారిపోతున్నాయి. టీడీపీ(TDP), బీజేపీ(BJP), జనసేన (Janasena)మూడు ఒకవైపు.. అధికార వైసీపీ(YCP) ఒక్కటే ఒకవైపు పోటీ చేస్తూ ఈసారి ఎన్నికల్లో తమ బలాబలాలు నిరూపించుకోవాలని ప్రయత్నిస్తున్నాయి అన్నీ పార్టీలు.

అయితే కూటమి పార్టీల్లో సీట్ల కేటాయింపు మూడు పార్టీల నేతలకు తల నొప్పిగా మారింది. చివరకు టీడీపీ కీలక నేత, సినీ నటుడు హిందూపురం సిట్టింగ్ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణపై కూడా ఈ ఎఫెక్ట్ పడింది. సీట్ల కేటాయింపులో భాగంగా హిందూపురం(Hindupuram) టీడీపీకి దక్కింది. అయితే అక్కడి నుంచి పోటీ చేయాలని.. ఎలాగైనా తనకు టికెట్ వస్తుందని గంపెడు ఆశలు పెట్టుకున్న ఆధ్యాత్మిక గురువు, శ్రీపీఠం వ్యవస్థాపకుడు పరిపూర్ణానందస్వామి(Paripoornananda Swamy) నిరాశకులోనయ్యారు. అంతే కాదు తనకు టికెట్ రాకపోవడానికి కారణం చంద్రబాబే అంటూ సంచలన ఆరోపణలు చేశారు. తనకు టికెట్ ఇస్తే ముస్లింలు దూరమవుతారని ఆయనే స్వయంగా చెప్పినట్లుగా తెలిపారు పరిపూర్ణానందస్వామి. హిందూపురం టికెట్ విషయంలో కూటమి పార్టీలు పునరాలోచన చేయకపోతే .. స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేస్తానంటూ హెచ్చిరించారు. అయితే షడన్ గా పరిపూర్ణానందస్వామి బాలయ్య కుర్చికి ఎసరు పెట్టడం చూసి హిందూపురం ఓటర్లతో పాటు టీడీపీ,బీజేపీ, జనసేన నేతలు అయోమయంలో పడ్డారు. స్వామిజీ అన్నంత పని చేస్తే పరిస్థితి ఏంటని లెక్కలు వేసుకుంటున్నారు.

పరిపూర్ణానంద పలుకులు..

శ్రీపీఠం వ్యవస్థాపకులు, ఆధ్యాత్మిక గురువు పరిపూర్ణనందస్వామి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. మరో నెల 15రోజుల్లో ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈనేపథ్యంలో ఆయన హిందూపురం నుంచి తాను పోటీ చేస్తానని ప్రకటించడం సంచలనంగా మారింది. మొదట్నుంచి పరిపూర్ణానందస్వామి బీజేపీ టికెట్ ఇస్తుందనే ఆశలో ఉన్నారు. కాని ఈసారి టీడీపీతో బీజేపీ, జనసేన పొత్తుపెట్టుకోవడంతో ఆ కోరిక కాస్తా తీరేలా కనిపించడం లేదు. అందుకే హిందూపురం టికెట్ తనకు ఇవ్వాలని లేదంటే ఇండిపెండెంట్ గా పోటీ చేయడానికి కూడా వెనుకాడబోనని హెచ్చరించారు పరిపూర్ణానంద స్వామి.

బీజేపీ టికెట్ ఇవ్వకపోవడంతో..

హిందూపురం టికెట్ విషయంలో పునరాలోచన చేయాలని పార్టీలకు సూచించారు స్వామిజీ. గత ఏడాది నుంచి బీజేపీ తరపున హిందూపురంలో ప్రచారం చేస్తున్నారు. పలు కార్యక్రమాలు, జాబ్ మేళాలు, శోభయాత్రలు నిర్వహిస్తూ స్తానికంగా పట్టు సంపాదించుకున్నారు. అయితే షడన్ గా పొత్తులు కుదరడంతో హిందూపురం టికెట్ టీడీపీ కోటాలోకి వెళ్లడంతో బీజేపీ టికెట్ విషయంలో పరిపూర్ణానందస్వామికి హ్యాండ్ ఇచ్చింది. దీంతో ఆయన తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. తాను హిందూపురం నుంచి బరిలోకి దిగుతానని పొత్తులకు ముందే అధిష్ఠానానికి చెప్పానని గుర్తుచేశారు. తనకు టికెట్ దక్కకపోవడానికి కారణం టీడీపీ అధినేత చంద్రబాబేనంటూ బాంబ్ పేల్చారు ఆధ్యాత్మిక గురువు.

చంద్రబాబే అంతా చేసింది..

హిందూపురం సీటును స్వామీజీకి ఇస్తే ముస్లింలు దూరమవుతారని చంద్రబాబు స్పష్టంగా చెప్పారని, ముస్లింల కోసం హిందువులను తాకట్టు పెట్టడానికి చంద్రబాబు సిద్ధమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముస్లింల కోసం 85 శాతం ఓటుబ్యాంకు ఉన్న హిందువులను బొందలో పెట్టేందుకు ఆయన సిద్ధమయ్యారని తన ఆవేశాన్ని వెళ్లగక్కారు. తాను ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే వ్యక్తినని పేర్కొన్నారు. దక్షిణాదిలో హిందూపురం చాలా ముఖ్యమైన ప్రాంతమని, పేరులోనే హిందూ ఉందని, అందుకనే ఇక్కడి నుంచి పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలకు పోటీచేయాలని నిర్ణయించుకున్నట్టు తెగేసి మరీ చెప్పారు.

పోటీ చేస్తారా.. వెనక్కి తగ్గుతారా..

హిందూపురం అసెంబ్లీ సీటు టీడీపీ కోటాలోకి వెళ్లింది. కాని పార్లమెంట్ సీటుకు పరిపూర్ణానందస్వామి పేరును బీజేపీ హైకమాండ్ పరిశీలిస్తుందని తెలుస్తోంది. పొత్తుల నేపథ్యంలో బీజేపీ తనకు టికెట్ ఇవ్వదని తెలిసే స్వామిజీ ఈకామెంట్స్ చేశారని ..ఇండిపెండెంట్ గా బరిలోకి దిగుతానని చెప్పినట్లుగా సమాచారం. అయితే దక్షిణాది రాష్ట్రాల్లో మరీ ముఖ్యంగా ఏపీ, తెలంగాణలో పట్టు సాధించాలనుకునే బీజేపీ పరిపూర్ణానందస్వామికి టికెట్ ఇస్తుందా లేదా అనేది మాత్రం ఇప్పటి వరకు క్లారిటీగా చెప్పలేదు. మరి స్వామిజీ తాను చెప్పినట్లుగానే స్వతంత్ర అభ్యర్ధిగా నిలబడతారా లేక కూటమి అభ్యర్ధికి మద్దతిస్తారో చూడాలి.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest