UPDATES  

 చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో నిజమైన ప్రజా ప్రభుత్వం

అనకాపల్లి:చంద్రబాబు సారథ్యంలో రాష్ట్రంలో నిజమైన ప్రజా ప్రభుత్వం ఏర్పడిందని మాజీ మంత్రివర్యులు దాడి వీరభద్ర గారు అన్నారు. శుక్రవారం లక్ష్మీనారాయణ నగర్ లోని తన కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రజల ఆస్తులను రాష్ట్రవ్యాప్తంగా కబ్జా చేయాలనే దురుద్దేశంతో జగన్ ప్రవేశపెట్టిన భూ యాజమాన్య చట్టాన్ని చంద్రబాబు రద్దు చేశారన్నారు. రాష్ట్రంలో ఉన్న తమ ఆస్తులను జగన్ కబ్జా చేస్తాడనే భయంతో రాష్ట్ర ప్రజలే కాకుండా ఇతర దేశాల్లో ఉన్న తెలుగువారు కూడా తమ సొంత ఖర్చులతో వచ్చి జగన్ ను ఓడించడానికి ఓట్లు వేశారన్నారు. ఈ చట్టం ప్రకారం వైసీపీ నాయకులకు భూకబ్జాలను చేసే అధికారం ఇచ్చి సివిల్ కోర్టులకు కూడా అధికారాలు తొలగించారన్నారు. ప్రపంచం మొత్తం మీద కోర్టులకు అధికారాలను తొలగించిన ఏకైక నాయకుడు జగన్ అని అన్నారు. చంద్రబాబు అన్నట్టుగా ముఖ్యమంత్రి ఎలా ఉండకూడదో జగన్ ప్రజలకు నేర్పాడని అన్నారు. ప్రజల పేదరికాన్ని గుర్తించి మూడు వేల రూపాయల పెన్షన్ను నాలుగువేలకు పెంచుతూ దీనికి ఎన్టీఆర్ భరోసా అనే పేరును కూడా పెట్టడం జరిగిందన్నారు. గత శాసనసభ ఎన్నికలకు ముందు మెగా డీఎస్సీ ని పెడతామని హామీ ఇచ్చిన జగన్ డీఎస్సీ పెట్టలేదు సరి కదా సుమారు పదివేల గ్రామస్థాయి ప్రాథమిక పాఠశాలలను నిర్దాక్షిణ్యంగా మూసివేసారన్నారు. దానివలన గ్రామీణ విద్యార్థులు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న పాఠశాలకు వెళ్లలేక చదువు మానివేసి కూలీ పనులలో నిమగ్నమయ్యారన్నారు. చంద్రబాబు ఒకేసారి 16,347 ఉపాధ్యాయ ఉద్యోగాలను నియమించడానికి మెగా డీఎస్సీ ని ప్రకటించడం నిరుద్యోగులకు ఒక వరం అన్నారు. క్రమంగా పరిపాలన వ్యవహారాలను విభాగాలు శాఖల వారీగా సమీక్షించి గత ఐదు ఏళ్లలో జరిగిన అక్రమాలను భూకబ్జాలపై విచారణ జరిపించి సంబంధిత అధికారులపై చట్టపరమైన చర్యలను తీసుకుంటారని అన్నారు. ప్రమాణస్వీకారం చేసిన 24 గంటల లోపల జగన్ కు తనతో మిగిలిన ప్రజా ప్రతినిధులు జ్ఞాపకం వచ్చారన్నారు. శిశుపాలుడు తప్పులను లెక్కపెట్టినట్టు తెలుగుదేశం తప్పులను లెక్కపెట్టమని వారికి ఆదేశాలు ఇచ్చారన్నారు. జగన్ తప్పులను లెక్కపెట్టడం చేతకాక ఐదేళ్ల తప్పులకు పరిష్కారంగా జగన్ ను ప్రజలు ఓడించారన్నారు. అధికారంలో ఉన్నంతసేపు బ్రోకర్లను, డాక్టర్లను, కబ్జాదారులను ప్రోత్సహించి సుమారు 75% తన ప్రజా ప్రతినిధులను కలవడానికి గాని, మాట్లాడడానికి గాని నిరాకరించాలన్నారు. ధృతరాష్ట్రునికి కళ్ళు లేవు కానీ చెవులు ఉండేవని, కానీ కళ్ళు చెవులు కూడా జగన్ కి లేవన్నారు. ముఖ్యమంత్రి అంటే ఈ రాష్ట్రానికి, రాష్ట్ర ఆస్తులకు, ప్రజలకు చక్రవర్తిని అనే భావంతో ప్రజలకు నరకం చూపించినందుకు ప్రజలు గుణపాఠం చెప్పారని అన్నారు. ఆయన చేసిన అక్రమాలకు రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. ఎమ్మెల్సీలతో శాసనమండలి సభ్యులతో శాసనమండలిలో తమకు మెజారిటీ ఉంది కాబట్టి ప్రభుత్వాన్ని నడవనీయకుండా అన్ని విధానాలను అడ్డుకోమని యత బోధ చేశారన్నారు. ప్రధానంగా చంద్రబాబు రద్దు చేసిన భూ యాజమాన్య చట్టం శాసనసభ ఆమోదం పొందిన తరువాత శాసనమండలిలో వ్యతిరేకించమని కూడా ఆదేశాలు ఇచ్చారన్నారు. పదవి పోయినా తన విధానాలను మార్చుకోకుండా ఓడినా కూడా ప్రజలపై కక్ష సాధింపు చర్యలు తీసుకోవడానికి తన పార్టీకి ఆదేశాలు ఇవ్వడం దురదృష్టకరమని మాజీ మంత్రి దాడి వీరభద్ర రావు గారు అన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest