హైదరాబాద్ (తెలంగాణ వాణి కరస్పాండెంట్)
కాంగ్రెస్ ప్రభుత్వంపై సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి పులి మీద స్వారీ చేస్తున్నారని అన్నారు. చెరువుల ఆక్రమణలపై శ్వేత పత్రం రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు. ఐపీఎస్ రంగనాథ్ మంచి మనిషి అని… పనిలో స్పీడ్ ఉందని కూనంనేని కొనియాడారు. చెరువులు, శికం భూమిలో పర్మిషన్ ఇచ్చిన అధికారులు, మంత్రులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్‌ను రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. కవిత ఒక ఆడపిల్ల అని.. ఆమె తప్పు చేసిందా ఒప్పు చేసిందా అనేది కోర్టులు డిసైడ్ చేస్తాయని పేర్కొన్నారు.
కవిత ఆడపిల్ల ఆమెపై కక్ష ఎందుకు?
ఆడపిల్ల మీద అంత కక్ష ఎందుకు అని కూనంనేని ప్రశ్నించారు. రాజకీయంగా ఏమైనా చేయాలనుకుంటే కేసీఆర్‌తో చూసుకోవాలని ఆమెపై రాజకీయం ఎందుకని కూనంనేని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రుణమాఫీ విషయంలో స్పష్టంత ఏది ?
రుణమాఫీ విషయంలో పట్టింపులు ఎందుకని కూనంనేని ప్రశ్నించారు. ఇచ్చినవి ఇచ్చామని.. ఇవ్వనివి లేదని చెప్పాలని పేర్కొన్నారు. రేషన్ కార్డుకు నిబంధన ఎందుకని ఆయన ప్రశ్నించారు. చిన్న ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారని వారికి రుణమాఫీ చేయరా? అని కూనంనేని నిలదీశారు. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టు అందరికీ రుణమాఫీ చేయాలన్నారు.
సెప్టెంబర్ 17 ను అధికారికంగా గుర్తించాలని డిమాండ్
సెప్టెంబర్ 17 ను అధికారికంగా గుర్తించాలని, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి నిజమైన వారసులు కమ్యూనిస్టులు అని కూనంనేని పేర్కొన్నారు. సెప్టెంబర్ 17 ను అధికారికంగా చేస్తే ముస్లింలు వ్యతిరేకించరని తెలిపారు.
చెరువుల కబ్జాపై స్పష్టత ఇవ్వండి
హైదారాబాద్ జంట నగరాల పరిధిలో ఎన్ని చెరువులు కబ్జాకు గురయ్యాయో వాటి లిస్ట్‌ను హైడ్రా విడుదల చేయాలని కూనంనేని డిమాండ్ చేశారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని పాఠ్య పుస్తకాలలో చేర్చాలని కూనంనేని కోరారు. ఆర్ఎస్ఎస్ కు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాలకు సంబంధం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అందరికీ రుణమాఫీ చేయాలన్నారు. మంత్రులు ఒక్కొక్కరు ఒక్కో మాట కాకుండా అందరూ కలిసి ఒకే మాట చెప్పాలని డిమాండ్ చేశారు. రుణమాఫీ విషయంలో బీఆర్ఎస్‌తో పోల్చితే కాంగ్రెస్ వెయ్యి పాళ్ళు నయమని చివరిలో కూనంనేని ప్రశంసించారు. మొత్తానికి కూనంనేని అయితే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విమర్శలైతే చేశారు. మిత్రపక్షంగా ఉండి కూడా విమర్శలు గుప్పించడం ఆసక్తికంగా మారింది..