ధర్మారం (తెలంగాణ వాణి) మండలంలోని కొత్తూరు గ్రామానికి చెందిన కుడుదల కిష్టయ్య జీవనోపాధి కోసం రోజు కూలి పనులకు వెళ్తూ తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. పని చేస్తున్న సమయంలో అనుకోకుండా జరిగిన ప్రమాదం అతని జీవితాన్నే అస్తవ్యస్తం చేసింది. కూలి పనిలో భాగంగా ఒకటో అంతస్తు నుండి అదుపుతప్పి కింద పడి కిష్టయ్య తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ప్రమాదంలో అతని ఎడమ తొడ ఎముక పూర్తిగా విరిగిపోయి, నడవలేని స్థితికి చేరుకున్నాడు. ప్రమాదం జరిగిన వెంటనే సరైన ఆర్థిక స్తోమత లేకపోవడంతో అతనికి కుటుంబ సభ్యులు తగిన వైద్యం అందించలేకపోయారు. ఈ సంఘటన జరిగి దాదాపు రెండు నెలలు గడిచినా, కిష్టయ్య మంచానికే పరిమితమై తీవ్రమైన నొప్పులు, శారీరక బాధలతో కాలం గడుపుతున్నాడు. కుటుంబ పరిస్థితి బలహీనంగా ఉండటంతో చికిత్స ఖర్చులు భరించడం అసాధ్యంగా మారింది. ఈ పరిస్థితిని గమనించిన గ్రామానికి చెందిన ఎమ్మార్పీఎస్ ధర్మారం మండలం కో-కన్వీనర్ నేరువట్ల అభిలాష్, దళిత యువజన సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి నేరువట్ల రాకేష్, కార్యదర్శి నేరువట్ల శశి కుమార్ మానవత్వంతో స్పందించారు. బాధలో ఉన్న కిష్టయ్యను నిర్లక్ష్యం చేయకుండా స్వయంగా ముందుకొచ్చి అతన్ని ఆసుపత్రికి తరలించారు. వైద్యులను సంప్రదించి అవసరమైన పరీక్షలు చేయించి, విరిగిన కాలుకు శస్త్రచికిత్స చేయించేందుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేశారు. యూత్ సభ్యుల సహకారంతో కిష్టయ్యకు తక్షణ వైద్య సహాయం అందడంతో పాటు, అతని ఆరోగ్య పరిస్థితి క్రమంగా మెరుగుపడుతుందని వైద్యులు తెలిపారు. ఈ సందర్భంగా యువత చూపిన సేవాభావం గ్రామంలో ప్రశంసలు అందుకుంటోంది. గ్రామస్థులు మాట్లాడుతు, ఇలాంటి మానవతా కార్యక్రమాలు సమాజంలో మరింత విస్తరించాలని, ఆపదలో ఉన్నవారికి యువత అండగా నిలవాలని ఆకాంక్షించారు. అవసరంలో ఉన్న వ్యక్తికి చేయూతనిచ్చిన యువత చర్యలు ఇతరులకు ఆదర్శంగా నిలుస్తాయని వారు తెలిపారు.
