UPDATES  

NEWS

 రైతుల పట్ల నిబద్ధతను మరోసారి చాటిన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్

ఎల్లారెడ్డి నియోజకవర్గం నాగిరెడ్డిపేట మండల నిజాంసాగర్ ప్రాజెక్టు ఫోర్‌షోర్ ప్రాంతంలో జంగిల్ క్లియరెన్స్, ప్రవాహ మార్గంలో అడ్డంకుల తొలగింపు పనులకు రూ. 2.08 కోట్ల వ్యయంతో తెలంగాణ ప్రభుత్వం జీఓ జారీ

ఎల్లారెడ్డి జనవరి 09 తెలంగాణ వాణి ప్రతినిధి

ఎల్లారెడ్డి నియోజకవర్గ రైతుల దీర్ఘకాలిక సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా ఎమ్మెల్యే మదన్ మోహన్ గారు కీలక విజయం సాధించారు.నాగిరెడ్డిపేట మండల పరిధిలోని నిజాంసాగర్ ప్రాజెక్టు ఫోర్‌షోర్ ప్రాంతంలో జంగిల్ క్లియరెన్స్, ప్రవాహ మార్గంలో అడ్డంకుల తొలగింపు పనులకు రూ. 2.08 కోట్ల వ్యయంతో తెలంగాణ ప్రభుత్వం జీఓ జారీ చేసింది. ఈ నిర్ణయం వర్షాకాలంలో ప్రాజెక్టు బ్యాక్ వాటర్స్ వల్ల నష్టపోతున్న రైతులకు భారీ ఊరటనిచ్చింది.

వర్షాకాలంలో నిజాంసాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్స్ కారణంగా వ్యవసాయ భూములు ముంపునకు గురై పంట నష్టం వాటిల్లుతున్న నేపథ్యంలో, ఈ సమస్యను మొదటి నుంచే ఎమ్మెల్యే మదన్ మోహన్ గారు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు. రైతులకు నష్టం కలగకుండా జంగిల్ క్లియరెన్స్ తప్పకుండా సాధిస్తానని రైతులకు ఇచ్చిన హామీని ఆయన నెరవేర్చారు.

ఈ అంశాన్ని ఎమ్మెల్యే మదన్ మోహన్ శాసనసభ సమావేశాల్లో పలు మార్లు ప్రస్తావించడంతో పాటు, తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ని స్వయంగా కలిసి నిజాంసాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్స్ కారణంగా ఎల్లారెడ్డి నియోజకవర్గ ముఖ్యంగా నాగిరెడ్డిపేట మండల రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించి తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. రైతుల పరిస్థితిని అర్థం చేసుకున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సానుకూల స్పందనతో ప్రభుత్వం ఈ కీలక జీఓను జారీ చేసింది.

ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల సమయంలో ఎమ్మెల్యే మదన్ మోహన్ వ్యక్తిగతంగా ముంపు ప్రాంతాలను సందర్శించి రైతులతో మాట్లాడి పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించారు. ఆ సందర్భంగా రైతులు నిజాంసాగర్ ప్రాజెక్టు ఫోర్‌షోర్ ప్రాంతంలోని అడవులు తొలగిస్తే భవిష్యత్తులో ముంపు నష్టాన్ని చాలా వరకు నియంత్రించవచ్చని కోరగా, ఎమ్మెల్యే ఇచ్చిన హామీ ఇప్పుడు కార్యరూపం దాల్చింది.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ మోహన్ మాట్లాడుతూ, నిజాంసాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్స్ పరిధిలోని రైతుల నుండి ఇది ఎన్నాళ్లుగానో పెండింగ్‌లో ఉన్న డిమాండ్ అని, ప్రతి వర్షాకాలంలో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. జంగిల్ క్లియరెన్స్ పనులు పూర్తయితే భవిష్యత్తులో పంట నష్టాన్ని గణనీయంగా తగ్గించవచ్చని, ఇది ఎల్లారెడ్డి నియోజకవర్గ అభివృద్ధిలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుందని పేర్కొన్నారు.

రైతుల కష్టాలను అర్థం చేసుకుని సానుకూలంగా స్పందించినందుకు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఎమ్మెల్యే మదన్ మోహన్ కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఈ పనుల సాధనలో కీలకంగా సహకరించిన ప్రభుత్వ అధికారులు, సిబ్బంది కృషిని కూడా ప్రశంసించారు.

ఈ నిర్ణయంపై ఎల్లారెడ్డి నియోజకవర్గ రైతులు హర్షం వ్యక్తం చేస్తూ, తమ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం సాధించిన ఎమ్మెల్యే మదన్ మోహన్ కృషిని అభినందిస్తూ కృతజ్ఞతలు తెలియజేశారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest