UPDATES  

 వాములో ఎన్నో ఔషధ గుణాలు..

వంటింట్లో ఉండే వాములో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. అజీర్తి సమస్యను దూరం చేయటంలో ఇది అద్భుతంగా పనిచేస్తుంది. అన్నం అరగకపోవడం, నిద్రలేమి, నీరసం, బిపి, మలబద్ధకం వంటి సమస్యలు వాము ద్వారా దూరం చేసుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

వామును రోజూ ఆహారంలో తీసుకోవటం ద్వారా శరీరం తేలికగా ఉంటుంది. పిల్లల ఆహారంలో దీనిని వాడటం ద్వారా కడుపులో నులిపురుగులు పెరగవు. పేగుల్లో, జీర్ణాశయంలో వచ్చే సమస్యలు దూరమవుతాయి. విరేచనానికి ఇబ్బంది పడేవారు వాము కషాయాన్ని, ఆకును వాడటం మంచిది. ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు కాసింత నోట్లో వేసుకుని పడుకోవాలని పెద్దలు సూచిస్తుంటారు. ఎందుకంటే శరీరంలో పేరుకుపోయిన అనవసర కొవ్వును వాము కరిగిస్తుంది. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కల్గిస్తుంది.
వాము, మిరియాలు వేర్వేరుగా వేయించి కొద్దిగా నీరు కలిపి నూరి, వడకట్టి పిల్లలకు తాగిస్తే అజీర్తి, విరేచనాలు, కడుపు ఉబ్బరం తగ్గుతాయి. వేడి అన్నంపై కొద్దిగా వాము పొడిని, కొద్దిగా మిరియాల పొడిని తగినంత ఉప్పు వేసి కలిపి తీసుకుంటే అజీర్తిని దూరం చేస్తుంది. కషాయంగా తీసుకోవడటం ద్వారా మూత్రపిండాల్లో రాళ్లు కరుగుతాయి. తేనెతో కలిపిగానీ, పొడిగానీ తీసుకోవటం వల్ల మహిళల్లో నెలసరి సమస్యలు తగ్గుతాయి. నిప్పులపై వాము వేసి ఆ పొగ పీల్చితే జలుబు, ముక్కుదిబ్బడ తగ్గుతాయి. లోపల పేరుకున్న కఫం పడిపోతుంది. వాము ఆకును కూరగా చేసుకుని తింటే శ్లేష్మం నివారణ అవుతుంది. వాము, ఉప్పు, మిరియాలు కలిపి నూరి పరగడుపున తింటే రక్తహీనత నయమవుతుంది. శీతాకాలంలో ఎదుర య్యే జీర్ణ, శ్వాస సమస్యలకు, శరీర నొప్పులకు వాము బాగా పనికొస్తుంది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest