UPDATES  

 నరేంద్ర మోడీ “వాటర్ స్ట్రైక్”.. పాకిస్థాన్ కు నీళ్ళు బంద్

ఆ మధ్య పాకిస్తాన్ దేశంపై మన సైన్యం సర్జికల్ స్ట్రైక్ చేసింది గుర్తుందా. యూరీ, పుల్వామా ఘటనలకు కౌంటర్ గా భారత్ ఆపరేషన్లు చేపట్టింది.

కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇంతటితో ఆగడం లేదు. కాశ్మీర్ సరిహద్దుల్లో, దేశంలోని ఇతర ప్రాంతంలో అల్లకల్లోలం సృష్టించిన పాకిస్థాన్ కు చుక్కలు చూపిస్తున్నారు. పాకిస్థాన్ వ్యవసాయానికి ముఖ్య ఆధారమైన రావి నది జలాలు అటువైపు వెళ్ళకుండా అడ్డుకట్ట వేశారు. గతంలోనే ఇది జరగాల్సి ఉండగా.. గత ప్రభుత్వాల “లిబరల్” రాజకీయాల వల్ల పాకిస్తాన్ దర్జాగా రావినది జలాలను ఉపయోగించుకుంది. మనం ప్రసాదించిన జలాలతో వ్యవసాయం చేసుకొని.. మన దేశంపైకే బుసలు కొట్టింది. వరుస బాంబు దాడులతో దేశాన్ని కకావికలం చేసింది. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత పాకిస్తాన్ పై ప్రధానంగా దృష్టి పెట్టారు. ఉగ్రవాదానికి అడ్డుకట్ట వేసే క్రమంలో పలు చర్యలు తీసుకున్నారు. ఆర్టికల్ 370 రద్దు, వరుస సర్జికల్ స్ట్రైక్స్.. ఇప్పుడు రావినది ప్రవాహాన్ని భారత్ వైపు మళ్ళించడం.. వంటి విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు.

వాస్తవానికి రావి నది జలాలు గతంలో కుదిరిన ఒప్పందం ప్రకారం భారతదేశానికే దక్కాలి. కానీ గత ప్రభుత్వాల పనికిమాలిన రాజకీయాల వల్ల రావినది జలాలను పాకిస్థాన్ 45 సంవత్సరాల పాటు దర్జాగా వాడుకుంది. ఈ క్రమంలో బిజెపి ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం పాకిస్థాన్ వైపు రావి నది ప్రవాహాన్ని పూర్తిగా నిలిపివేసింది. ఈ నదిపై ఆనకట్ట కట్టడంతో జలాలు మొత్తం భారత్ కే దక్కుతాయి. 1960లో ప్రపంచ బ్యాంకు పర్యవేక్షణలో భారత్, పాకిస్థాన్ మధ్య సింధూ జలాల ఒప్పందం (Indus water treaty) కుదిరింది. దీని ప్రకారం ఈ నది నుంచి పాకిస్థాన్ దేశానికి వెళ్లే నేటి ప్రవాహాన్ని నిలిపి వేసేందుకు ఆనకట్ట నిర్మించాలని భారత్ అప్పట్లో నిర్ణయించింది. ఈ ఆనకట్ట నిర్మాణం కోసం పంజాబ్, జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వాల మధ్య 1979లో ఒప్పందం కుదిరింది. రావి నదిపై ఎగువ వైపు రంజిత్ సాగర్ డ్యాం, కింది వైపు షాపూర్ కంది బ్యారేజ్ నిర్మించాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించి అప్పటి జమ్మూ కాశ్మీర్, పంజాబ్ ముఖ్యమంత్రులు షేక్ మహమ్మద్ అబ్దుల్లా, ప్రకాష్ సింగ్ బాదల్ సంతకాల ప్రక్రియ పూర్తి చేశారు. 1982 లో ప్రధానమంత్రి ఇందిరా గాంధీ ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం శంకుస్థాపన చేశారు. 1998 వరకు ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కావాల్సి ఉండగా.. వివిధ కారణాలవల్ల జాప్యం జరిగింది.

2001లో రంజిత్ సాగర్ డ్యాం నిర్మాణం పూర్తయింది. షాపూర్ కంది బ్యారేజ్ నిర్మాణం ఆగిపోయింది. ఫలితంగా పాక్ కు నిరాటంకంగా రావి నది జలాలు సరఫరా అయ్యాయి. అయితే 2008లో ఈ ప్రాజెక్టును కేంద్రం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించింది. 2013 లో నిర్మాణం ప్రారంభించినప్పటికీ పంజాబ్, జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వాల మధ్య విభేదాల వల్ల ప్రాజెక్టు నిర్మాణం ఆగిపోయింది. 2018లో కేంద్రం మధ్యవర్తిత్వం వ్యవహరించడంతో నిర్మాణ పనులు మళ్లీ ప్రారంభమయ్యాయి. ఎట్టకేలకు ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కావడంతో ఆదివారం నుంచి పాక్ కు నేటి ప్రవాహం పూర్తిగా నిలిచిపోయింది.

ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కావడంతో రావినది జలాలను జమ్మూ కాశ్మీర్ లోని కతువా, సాంబా జిల్లాలకు మళ్లిస్తారు. 32వేల హెక్టార్లకు ఈ ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందుతుంది. ఈ ప్రాజెక్టు ద్వారా ఉత్పత్తి చేసే జల విద్యుత్ లో 20% జమ్మూ కాశ్మీర్ కు అందిస్తారు. ఈ నీళ్లు పంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాలకు కూడా ఉపయోగపడతాయి.. 1960 లో కుదిరిన ఒప్పందం ప్రకారం సింధు, జీలం, చినాబ్ పాక్ కు దక్కాయి. బియాస్, సట్లేజ్ నదులు భారత్ కు చెందాయి. అప్పట్లో ఈ ఒప్పందంపై భారత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ, పాకిస్తాన్ అధ్యక్షుడు ఆయుబ్ ఖాన్ సంతకాలు చేశారు. దశాబ్దాల తర్వాత రావి నది నీళ్లు పూర్తిస్థాయిలో వస్తుండడంతో రైతులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest